కష్టపడితే విజయం మీదే: రాష్ట్ర ఐ. టి. శాఖ మంత్రి కే.తారకరామారావు

*కష్టపడితే విజయం మీదే….*

*పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు మార్గనిర్దేశనం చేసిన మంత్రి శ్రీ కేటీఆర్*

పుస్తకాలతో కుస్తీ పడి కష్టపడితే విజయం మీదే అని మంత్రి రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.

మంగళవారం ఆయన సిరిసిల్ల పట్టణంలోని సినారె కళామందిరంలో పోలీస్ నియామకాల పరీక్షల నిమిత్తం జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్న కార్యక్రమానికి హాజరై, అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ..
కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే మనం నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుతామని అన్నారు. జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోలీసు నియామకాల పరీక్షల ఉచిత శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని, ఉద్యోగం సంపాదించి, భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మార్చుకోవాలని అన్నారు. 6 నెలలు
పట్టుదలతో కూర్చుని ఏకాగ్రతతో, నిరాశ చెందకుండా చదవాలని పేర్కొన్నారు.
సోషల్ మీడియాను కొన్ని రోజులు పక్కన పెట్టి చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
మీతో పాటు జిల్లాలో SC,ST నిరుద్యోగ అభ్యర్థులకు బైపాస్ లోని అంబేద్కర్ భవనంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని అన్నారు. అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా బుక్స్ స్టడీ మెటీరియల్ అందిస్తామని తెలిపారు.
దూర వ్యయప్రయాసలకు లోనుకాకుండా, మీకోసం చేపట్టిన ఈ శిక్షణ తరగతులకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో కూడా లేని సౌకర్యాలను ఇక్కడ ఉచిత కోచింగ్ సెంటర్ లో కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. కోచింగ్ సెంటర్ లను జిల్లా ఎస్పీ గారితో పాటు తాము కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని చెప్పారు.
పుస్తకాలు నిజమైన దేవుళ్ళు అని, మనం కోరుకున్న వరాలు ఇస్తాయని, పుస్తకాలు మనల్ని అడుగడుగునా ఆశీర్వదిస్తాయని పేర్కొన్నారు. చదువంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సూచించారు. మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మి పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి కొత్త కోణంలో ఆలోచిస్తే విజయం తథ్యమని మంత్రి అన్నారు.

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ…

రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కె. తారకరామారావు గారి మార్గదర్శనంలో జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అందులో 750 మందికి ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
అదేవిధంగా లెజెండ్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో కేటీఆర్ క్లాసెస్ అనే యాప్ రూపొందించడం జరిగిందని, ఇందులో ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర ఉద్యోగాలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల వారిగా 1,800 వీడియోలు పొందుపరచడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ యాప్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణకు హాజరవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న తరువాత ఆక్సిస్ ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా నిరంతరం ఆన్లైన్ లో చదువుకునే వెసులుబాటు ఉంటుందని సూచించారు.

అనంతరం పోటీ పరీక్షల కోసం అన్ని సబ్జెక్టుల వారిగా 1800 రకాల వీడియోలతో రూపొందించబడిన కేటీఆర్ క్లాసెస్ అనే యాప్ ను
మంత్రి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి శ్రీ రవీందర్ రావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఎన్ అరుణ, జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి, ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీ బి.సత్య ప్రసాద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్, మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ, సెస్ ఛైర్మన్ శ్రీ గూడూరి ప్రవీణ్, తోట అగయ్య డిఎస్పీ లు ఆర్.ఐ లు, సి.ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post