కాంట్రాక్టు పద్ధతిన డాక్టర్ల నియామకం

డాక్టర్ వృత్తి చాలా పవిత్రమైనదని, ప్రజలు డాక్టర్లను దేవునిగా కొలుస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ వృత్తికి న్యాయం చేసేలా డాక్టర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని వైద్య విధాన పరిషద్ ఆసుపత్రులలో పనిచేయుటకు నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు వచ్చిన అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి గైనిక్,పిడియాట్రిక్, జనరల్ సర్జన్, ఇ .యెన్.టి. మెడిసిన్, అనస్తేషియా , రేడియాలజి, ఆర్థోపెడిక్ తదితర అంశాలలో స్పెషలైజేషన్ చేసిన 24 మంది డాక్టర్లను ఎంపిక చేశారు. నూతనంగా నియామకం కాబడిన వారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నరసాపూర్ ఏరియా ఆసుపత్రి, తూప్రాన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు కాంట్రాక్టు పద్ధతిన పని చేయవలసి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఈ సేవలన్నీ అత్యవసరంగా భావించి నియామకం చేస్తున్నామని, కాబట్టి డాక్టర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని కలెక్టర్ కోరారు. నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏమైనా సమస్యలుంటే మెడికల్ సూపరింటెండెంట్ లేదా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి దృష్టికి తీసుకెళ్లవలసినదిగా ఆయన సూచించారు.
ఈ ఇంటర్వ్యూ లో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్ రావు, అభ్యర్థులు పాల్గొన్నారు.

Share This Post