కారుణ్య నియామకాలు ప్రక్రియను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు జిల్లా అధికారులతో కారుణ్య నియామకాలు తదితర అంశాలపై  సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరణించిన ప్రభుత్వ ఉద్యోగి యొక్క కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించుటలో అన్ని శాఖల అధికారులు నివేదికలు డిఆర్ఓ కు అందచేయాలని చెప్పారు. మరణించిన ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన ఆర్థికపరమైన బెనిఫిట్స్ తో  పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించుటకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కారుణ్య నియామకాలు కొరకు అవసరమైన ధృవీకరణ పత్రాలు జారీలో తహసిల్దారులు జాప్యం చేయక తక్షణం జారీ చేయాలని చెప్పారు.   ధృవీకరణ పత్రాలు జారీ కొరకు మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను పదే పదే కార్యాలయాల చుట్టూ త్రిప్పుకోవద్దని ఆయన పేర్కొన్నారు. మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు వారి వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించు విధంగా చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారుల పైనున్నదని ఆయన తెలిపారు. రైతుబంధు, వృద్ధాప్య, సీతారామ ప్రాజెక్టులో భూమి కోల్పోయిన లబ్ధిదారులకు, రైతులకు నగదు చెల్లింపులు చేయకుండా నిలిపివేసిన వినాయకపురం ఆంధ్రాబ్యాంకు మేనేజర్ పై రెవిన్యూ రికవరీ యాక్టు ప్రకారం నోటీసులు జారీ చేయాలని అశ్వారావుపేట తహసిల్దారును ఆదేశించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ప్రజలకు చెల్లించకుండా నిలుపుదల చేస్తే సంబందిత బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని,  అవసరమైతే అట్టి బ్యాంకులను సీజ్ చేయడానికి కూడా వెనుకాడనని హెచ్చరిస్తూ బ్యాంకు మేనేజర్ తనను కలవాలని ఆదేశించారు. వినాయకపురం ఆంధ్రాబ్యాంకు మేనేజర్ నిధులు చెల్లింపులు చేయడం లేదని ప్రజలు ప్రజావాణిలో పిర్యాదు చేశారని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు. అన్ని బ్యాంకు కంట్రోలర్లుకు ఆదేశాలు జారీ చేయాలని,  మున్ముందు ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయితే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, డిపిఓ రమాకాంత్, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, ర.భ.ఈ ఈ బీమ్లా, ఆర్డీఓ స్వర్ణలత అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post