కాళోజి సేవలు మరువరానివి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

సెప్టెంబర్ 09, 2021ఆదిలాబాదు:-

            ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు తెలుగువారి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కాళోజి నారాయణ రావు జయంతి ని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం రోజున అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట కాళోజి చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, స్వరాష్టం కాకున్నప్పటికీ తన విద్యాభ్యాసం ప్రాంతంలోని తెలుగువారికోసం ఎన్నో రచనలు చేశారని, తెలుగు వారి స్వరాష్టం కోసం పోరాటం చేయడం జరిగిందని అన్నారు. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషను అమలు పరచడం జరుగుతున్నదని, ప్రతి ఒక్కరు తెలుగు బాషలోనే మాట్లాడాలని అన్నారు. తన స్వరాష్ట్రం ఈ ప్రాంతం కానప్పటికీ తెలుగు భాషను నేర్చుకొని తెలుగులోనే మాట్లాడడానికి కృషి చేస్తున్నానని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, పలు సందర్భాల్లో కాళోజి నారాయణ రావు ను కలవడం జరిగిందని గుర్తు చేశారు. కలెక్టరేట్ పర్యవేక్షకులు రాజేశ్వర్ మాట్లాడుతూ, ఎన్నో కవిత్వాలు, రచనలు రాసిన మహోన్నత వ్యక్తి కాళోజి నారాయణ రావు అని అన్నారు. పలు భాషలు నేర్చుకొని తెలుగువారికోసం పోరాడిన వ్యక్తి అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శనం, భూమి కొలతల శాఖ సహాయ సంచాలకులు రాజేందర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు వర్ణ, నలంద ప్రియా, స్వాతి, కలెక్టరేట్, భూ కొలతలు, ట్రెజరీ, ముఖ్య ప్రణాళిక శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post