కీసరగుట్ట శివరాత్రి బ్రహ్మోత్సవాల సమన్వయ సమావేశంలో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,
మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కీసర మండలంలోని కీసర గుట్ట (కేసరగిరి క్షేత్రం) శ్రీరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను వైభోవేతంగా నిర్వహించాలని ఈ విషయంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
గురువారం మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆలయంలోని కార్యాలయంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా అధికారులు, ఆలయ కమిటీతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శనం కల్పించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ వెబ్సైట్ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం స్వామి వారి దర్శనానికి ప్రత్యేకంగా ఆన్లైన్ వెబ్సైట్ ఏర్పాటు చేసి వారు కోరుకున్న రోజున కోరుకున్న సమయానికి శ్రీరామలింగేశ్వరస్వామి దర్శనం కలుగుతుందని మంత్రి మల్లారెడ్డి వివరించారు. ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేయడం ఇది మొదటిసారి అని దీని ద్వారా తమ టిక్కెట్లు బుక్ చేసుకొన్న భక్తులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున టిక్కెట్తో దర్శనం కల్పించడం జరుగుతుందని దీంతో పాటు ఆన్లైన్లో దర్శనానికి బుక్ చేసుకొన్న భక్తులకు ఆర్జిత సేవలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మహాశివరాత్రి జాతర సమయంలో శ్రీరామలింగేశ్వరస్వామి వారి దర్శనానికి ఎలాంటి పాస్లు, వీఐపీలకు సంబంధించిన లెటర్లు అనుమతించబడవని ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. కీసరగుట్టకు వచ్చే వృద్ధులు, చిన్నపిల్లలకు వెంటనే ప్రత్యేక దర్శనం కల్పించడం జరుగుతుందని దీనికి క్యూ లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత రెండేళ్ళ క్రితం కరోనా సమయంలో ఎక్కువ భక్తులు రాలేదని… ప్రస్తుతం పరిస్థితులన్నీ బాగున్నందున మహాశివరాత్రి జాతరకు కీసరగుట్టకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుగంగా వ్యవహరించాలని ఏమాత్రం లోటుపాట్లు, పొరపాట్లు జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. మహాశివరాత్రితో పాటు అంతకు ముందు, తర్వాత రోజుల్లో సైతం భక్తులు ఎక్కువగానే వస్తారని దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలయ సిబ్బంది సైతం ఎక్కువ మందికి స్వామి వారి దర్శనం కలిగేలా చూడాల్సిందిగా మంత్రి సమావేశంలో సూచించారు. అలాగే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మహాశివరాత్రి జాతరను విజయవంతం చేయాలని సమావేశంలో మంత్రి మల్లారెడ్డి కోరారు. జాతర రోజుల్లో కీసర ఆలయం వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అలాగే జాతరలో పరిశుభ్రత ఉండాలని దీని కోసం జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులను నిర్వహించడంతో పాటు ఎక్కడ కూడా అపరిశుభ్రత లేకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని తెలిపారు. దీంతో పాటు జాతరలో భక్తులకు నీటి సౌకర్యం ఉండేలా ఆయా చోట్ల మంచినీటి సౌకర్యం, తాగునీటి వసతి కల్పించాలని ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. జాతరకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి తొక్కిసలాట, ఇబ్బందులు తలెత్తకుండా బ్యారీకేడ్లను ఏర్పాటు చేయాలని జాతర సమయంలో కరెంట్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోవాల్సిందిగా మంత్రి మల్లారెడ్డి అధికారులకు సూచించారు. దీంతో పాటు అన్ని శాఖల అధికారులు జాతరలో ఏమైనా అవసరాలు, ఇబ్బందులు ఉంటే ఇప్పటి నుంచే వాటిని సరి చేసుకోవాలని మంత్రి అధికారులకు తెలిపారు. మహాశివరాత్రి జాతరకు శ్రీరామలింగేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లలో భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా జాతరలో సరుకులు, ఇతర స్టాల్స్తో పాటు భక్తులకు అవసరమైన మేర టాయిలెట్లు ఉండేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ కీసర శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న శైవక్షేత్రమని మహాశివరాత్రి పండగకు హైదరాబాద్, ఇతర జిల్లాలతో పాటు పెద్ద సంఖ్యలో వస్తారని దీనిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేయాలని అన్నారు. శివరాత్రికి ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రతి ఒక్కరూ కృషి చేసి విజయవంతం చేయాలని సమావేశంలో అధికారులకు తెలిపారు. దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సహకారంతో చేస్తే ఇబ్బందులు తలెత్తకుండా జాతరను విజయవంతం అవుతుందని శరత్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం భక్తుల సౌకర్యార్థం నూతనంగా కల్పించిన ఆన్లైన్ విధానం ఎంతో మంచిదని దీని ద్వారా భక్తులు వారు కోరుకున్న సమయానికి స్వామి వారి దర్శనంతో పాటు పూజలు కూడా చేయడం అభినందనీయమని జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి తెలిపారు. కీసర గుట్టలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను సూచించారు.
ఈ సమన్వయ జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగస్త్య, ఆర్ డి ఓ రవి, డీఎస్పీ జానకీ ధరావత్, జడ్పీ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేశ్, ఆలయ కమిటీ ఛైర్మన్ రమేశ్ శర్మ, కీసర సర్పంచి మాధురి, ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) సుధాకర్రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.