కులవృత్తులను ప్రోత్సహించడం ద్వారా ప్రజల ఆర్థిక అభివృద్ధి – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ (నిజామాబాద్), సెప్టెంబర్ 8 :–

రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త పథకాలతో పలు కులవృత్తులను ప్రోత్సహిస్తుందని తద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఆ వృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

బుధవారం నాడు ఆయన బాల్కొండ నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.

శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో మత్స్యకారుల అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 62 లక్షల ఉచిత చేప పిల్లలు వదిలే కార్యక్రమం,

బాల్కొండలో ఒక కోటి 90 లక్షల రూపాయలతో నిర్మించే బాల్కొండ నియోజకవర్గ శాసన సభ్యుల క్యాంపు కార్యాలయానికి భూమి పూజ, కిసాన్ నగర్ గ్రామంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాలు ఆర్థికంగా పరిపుష్టి చెందాలంటే కుల వృత్తిదారులు ఆర్థికంగా మెరుగు పడాలని వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న అనేక కార్యక్రమాలలో చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం కూడా ఒకటి అన్నారు. మత్స్యకారులు మధ్య దళారుల చేతిలో మోసపోవద్దనే ఉద్దేశంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల మీద మత్స్యకారులకే పెత్తనం ఉండాలని
వారే సొంతంగా చేపలను అమ్ముకునే విధంగా వారికి వారి కుటుంబాలకు లాభం జరగాలన్న ఉద్దేశ్యంతో ఆరు సంవత్సరాల క్రితం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అన్నారు.

దేశంలో లో ఏ రాష్ట్రంలో లేని విధంగా మత్స్యకారులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 21 వేల 52 మంది సభ్యులతో సంఘాలు చేప పిల్లలని చెరువులో పెంచుకుని వారే పట్టుకొని ఊరూరా వాడవాడలా అమ్ముకొని లాభపడుతున్నారన్నారు. చేప పిల్లలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా వారికి మోపెడ్స్, ట్రాలీలు, ఫ్రీజర్లు, అనేక రకాలుగా వారికి సహాయం చేసి మార్కెటింగ్ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారని వివరించారు.

నిజామాబాద్ జిల్లాలో 896 చెరువులు, పోచంపాడుతో కలిపి అన్నిటిలో 4 కోట్ల 30 లక్షల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని,
దీనికిగాను 4 కోట్ల 40 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసిందని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ఈరోజు 62 లక్షల చేప పిల్లలు వదులడం జరిగిందన్నారు. మత్స్యకారులకు చేపలు బాగా అభివృద్ధి చెంది మత్స్యకారులకు మంచి లాభాలు రావాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 119 నియోజకవర్గాలలో దాదాపు 80 నియోజకవర్గాలలో క్యాంప్ ఆఫీసులు పూర్తి కావచ్చినాయని అన్నారు. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి ప్రతి నియోజక వర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు అధికారిక భవనం ఉంటే వారు అధికారిక కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, ప్రజలకు ఒక చోట అందుబాటులో ఉండి సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో సీఎం ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.

ఎమ్మెల్యే అధికారిక భవనం రాజకీయాలకు తావు లేకుండా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఒక దేవాలయంలా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత నరహరి ఎంపీపీ లావణ్య లింగం గౌడ్ ఏడి ఫిషరీస్ ఆంజనేయస్వామి ఆర్ డి ఓ శ్రీనివాస్ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో సంతోష్ కుమార్కి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

Share This Post