కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు పూర్తి వివరాలు శాఖల వారీగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు.

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 1 (శుక్రవారం).

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు పూర్తి వివరాలు శాఖల వారీగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి మరియు ములుగు జిల్లాల వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య మరియు సహకారశాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు మరియు ఫైళ్ల నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సమగ్ర అభివృద్ధి కొరకు వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య మరియు సహకారశాఖల ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల పూర్తి సమాచారంపై ఆయా శాఖల్లోని జిల్లా అధికారులతో పాటు మండల, గ్రామస్థాయి అధికారుల వరకు అవగాహన కలిగి ఉండి సకాలంలో లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేలా పథకాలను అమలు చేయాలని అన్నారు. ఆయా పథకాల వివరాలు ప్రజలకు తెలిసేలా జిల్లా నుండి గ్రామస్థాయి కార్యాలయాలలో ఫ్లెక్సీల రూపంలో అందుబాటులో ఉంచాలని అన్నారు. అధిక వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను వ్యవసాయశాఖ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారుల సమన్వయంతో సేకరించి నివేదిక అందించాలని, పంటనష్టం, ముంపు భూముల వివరాల సేకరణను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆర్డీవో శ్రీనివాస్ ను ఆదేశించారు. వర్షాకాలంలో పశువులకు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న సమయం కాబట్టి పశువైద్య అధికారులు,సిబ్బంది అందుబాటులో ఉండి పశువైద్య సేవలు అందించాలని, అవసరమైన సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవాలని పశుసంవర్ధకశాఖ అధికారులను ఆదేశించారు.
ప్రతి కార్యాలయంలో హెచ్ ఆర్ ఫైళ్లను సమర్థవంతంగా నిర్వహించి రెగ్యులర్ ఎంప్లాయ్స్ తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు ఒకేసారి అందించేలా చర్యలు తీసుకోవాలని, ఇంక్రిమెంట్ సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగులకు అందించాలని, ప్రతి శాఖలోని ఉద్యోగుల క్యాడర్, ఇంక్రిమెంట్ తేదీ, వారిపై ఉంటే డిసిప్లినరీ కేసుల వివరాలు, లీవ్స్ వివరాలు అందించాలని, ప్రతి ఒక్క ఉద్యోగి అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని సంబంధిత శాఖల సూపరింటెండెంట్లు ఆన్లైన్ అటెండెన్స్ ను పర్యవేక్షించాలని, గత 3 నెలలుగా నెలకు 22 రోజులకు తక్కువగా అటెండెన్స్ యాప్ లో హాజరు నమోదు చేసుకున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అన్నారు.

ఈ-ఆఫీస్ ద్వారా ఆన్లైన్లో సింగిల్ సబ్జెక్టుకు సింగిల్ ఫైల్ పద్ధతిలో ఆయా శాఖల్లోని కరెంట్ ఫైల్స్ మరియు క్లోజ్డ్ ఫైల్స్ వివరాలు అందించాలని, అకౌంట్ వివరాలు, నిధుల అందుబాటు స్కీముల వారిగా తెలియజేయాలని ఆదేశించారు. ఆయా శాఖలకు సంబంధించిన శాశ్వత భవనాలు, పరికరాలు, ఫర్నిచర్ తదితర ఆస్తుల వివరాలను తెలియజేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, అన్నారం బ్యారేజ్ ఇఇ.యాదగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల జిల్లా వ్యవసాయశాఖ అధికారులు విజయ్ భాస్కర్, గౌస్ హైదర్, జిల్లా పశుసంవర్ధక అధికారులు డాక్టర్. కుమారస్వామి. డాక్టర్. విజయ్ భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారులు జర్పుల భాస్కర్, వీరన్న, జిల్లా సహకార అధికారులు మద్దిలేటి, సర్దార్ సింగ్ మాలోతు, కలెక్టర్ కార్యాలయ ఏవో మహేష్ బాబు, ఆయా శాఖల సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

## అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం ముగిసి పోలేదని ఇంకా రెండు నెలలు మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆస్పత్రి వేస్టేజ్ ని వేసేందుకు ఖచ్చితంగా జిల్లాలోని అన్ని ఆసుపత్రుల ఆవరణలో గుంతలను తవ్వాలని అన్నారు. ఆన్లైన్ ఇ-అటెండెన్స్ ఆప్ లో ఈరోజు దాదాపు వంద మందికి పైగా వైద్య సిబ్బంది గైర్హాజరుగా ఉండడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పై అసహనం వ్యక్తం చేసి 100% ఇ-అటెండెన్స్ ఆప్ లో హాజరు నమోదు చేసుకోవాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యఆరోగ్యశాఖ ఆస్తుల వివరాలను డిఎంహెచ్ ఓ కార్యాలయం, సిహెచ్ సిలు, పిహెచ్ సి, సబ్ సెంటర్ ల వారీగా నమోదు చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు గానే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకే సారి జీతాలు చెల్లించాలని, ఉద్యోగుల పై తీసుకున్న డిస్ప్లేనరీ యాక్షన్ వివరాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్. శ్రీరామ్, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్. కొమురయ్య, డిఎంఅండ్హెచ్ఓ, డిప్యూటీ డిఎం&హెచ్ ఓల కార్యాలయాలు, పి.హెచ్.సిల సీనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post