కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా పేదలకు అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందే విధంగా అధికారులు కృషి చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు

కేంద్ర  ప్రభుత్వ నిధులతో ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా పేదలకు అమలు చేస్తున్న అన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందే విధంగా అధికారులు కృషి చేయాలని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ డి. హరిచందన  ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా  అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ  ( దిశ) సమావేశాన్నీ వెబ్ ఎక్స్ ద్వారా నిర్వహించారు.  జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల అభ్యున్నతికి అమలు చేస్తున్న పథకాల తీరు తెన్నులను కమిటీలో సమీక్షించారు.    వ్యవసాయ, వైద్యం, జిల్లా గ్రామీణాభివృద్ధి, విద్యుత్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యా శాఖ, జిల్లా సంక్షేమం, పౌర సరఫరాలు, ముఖ్య ప్రణాళిక, జి.యం. ఇండస్ట్రీస్, ఉద్యాన వనం, జిల్లాపరిషద్, అటవీ శాఖ ల పై సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా  దిశ కమిటీ  అధ్యక్షులైన పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి ఆయా శాఖల పనితీరు పై సంతృప్తి వ్యక్తం చేశారు.  వానాకాలం వరి ధాన్యం కొనుగోలు జిల్లాలో వంద శాతం పూర్తి అయ్యిందని, యసంగిలో  వరి ధాన్యం కొనుగోలుకు  ప్రభుత్వం హామీ ఇవ్వనందున రైతులు ఆరుతడి, వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.  రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు, మార్కెటింగ్ కు పుష్కలమైన అవకాశాలు ఉన్నందున ఉద్యానవన శాఖ ద్వారా రైతులకు ఆయిల్ పామ్ సాగు కై ప్రోత్సహించాలన్నారు.  గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో సద్వినియోగం చేసుకోవాలని, పని కోరుకునే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిని ఆదేశించారు.  వ్యక్తిగత మరుగుదొడ్లు, సామూహిక మరుగుదొడ్లు వంద శాతం ఏర్పాటు అయ్యే విధంగా చూడాలన్నారు.  మహిళ సంఘాల సభ్యులకు రుణాలు ఇచ్చి వివిధ రకాలైన వ్యాపారాలు చేసుకొని వారి ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా అవసరమైన నైపుణ్య శిక్షణ, అవగాహన కల్పించాలన్నారు.  విద్యుత్ శాఖ సమీక్ష సందర్బంగా పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ గ్రామాల్లో , వ్యవసాయ పొలాల్లో వంగిపోయిన,  తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలు ఉండటం వల్ల విద్యుత్ ఘాతాలు ఏర్పడుతున్నాయని వాటిని తొలగించి వాటి స్థానంలో క్రొత్త స్తంభాలు వేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు లేని పేదలందరికి నివాస గృహాలు కల్పించే విధంగా చర్యలు తీడుకోవాలని ప్రధాన మంత్రి గ్రామీణ యోజన కింద మంజూరు అయిన నిధులను త్వరగా సద్వినియోగం చేసి ఆన్నీ పనులు గ్రౌండింగ్ చేయాలని.పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు.  ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద జిల్లాకు మంజూరు అయిన యునిట్లు గ్రౌండింగ్ చేసి లబ్దిదారులకు అందించాల్సిందిగా జి.యం ఇండస్ట్రీస్ అధికారిని సూచించారు.    అటవీ శాఖ పై సమీక్ష సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు కృష జింకలు, కోతులు తదితర  జంతువుల వల్ల పంట పొలాలకు నష్టం చేకూర్చుతున్నాయని వీటిని తరలించేందుకు పార్లమెంటు లో ప్రస్తావిస్తానని తెలియజేసారు.

సమీక్ష సమావేశంలో పాల్గొన్న మద్దూర్ ఎంపిపి విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యుత్ సబస్టేషన్ల ఏర్పాటుకు తమ వ్యవసాయ భూమి ఇచ్చిన రైతులు తమకు అందులో ఉద్యోగం ఇవ్వలేదని సబస్టేషన్ల  ప్రారంభోత్సవానికి అడ్డుతగులుతున్నారని వారికి న్యాయం చేయాల్సిందిగా కమిటీ దృష్టికి తెచ్చారు.

సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ సమీక్షలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను అధికారులు చిత్త శుద్ధితో పాటించి అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత దిశ సమావేశంలో  లేవనెత్తిన అంశాలు వాటి పై తీసుకున్న చర్యల పై సమావేశంలోముందుగా చర్చించారు.  విద్యుత్ సబస్టేషన్ల ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు ఉపాధి కల్పించే విషయంలో పూర్తి వివరాలతో తనకు ఫైల్ పంపించాలని విద్యుత్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా చూస్తానని తెలిపారు.  కోవిడ్ నేపథ్యంలో  ఇంటింటి జ్వరం సర్వే వంద శాతం పూర్తి చేసి లక్షణాలు ఉన్నవారందరికి వైద్య కిట్లు అందించడం జరిగిందని తెలియజేసారు.

అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ పద్మజా రాణి, పి.డి.డి.ఆర్.డి.ఒ గోపాల్ నాయక్ ఆయా శాఖాల ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీపీ లు తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post