కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప రాజకీయ మేధావి, స్వాతంత్య్ర, తెలంగాణ ఉద్యమాల్లో ఎంతో చురుకుగా పాల్గొన్న మహానీయుడని జిల్లా కలెక్టర్ అనుదీప్ వారి సేవలను కొనియాడారు.

సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకని జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్  పాల్గొని మహానీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి  మహానీయుడు మన తెలంగాణలో జన్మించడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. తెలంగాణకు వీరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం భావితరాలకు తెలియచేయాలనే లక్ష్యంతో జన్మదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయన అనుసరించిన సిద్ధాంతాలు మనందరికీ స్ఫూర్తి అని, ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న భాదలు, బాణిని దేశమంతా వినిపించారని, వారి ఆశయసాధనకు మనందరం అంకితం కావాలని, వారి స్పూర్తితో మన ప్రజలకు మరింత సేవలు అందించాలని ఆయన కోరారు. నిరంకుశ నైజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుల్లో ఒకరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి స్ఫూర్తితో మరింత అభివృద్ధిని సాధించేందుకు మనందరం కార్మోన్ముఖులం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసిన గొప్ప ఆశయవాది కొండా  లక్ష్మణ్ గారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో అశోక్ చక్రవర్తి,  జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి సురేందర్, బిసి సంఘాల నాయకులు కొల్లు పద్మ, మాడిసెట్టి శ్రీనివాస్, రెడ్డిమళ్ల వెంకటేశ్వరావు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post