కొత్తగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారికి ఎపిక్ కార్డ్ లు పంపిణీ చేయాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్

              ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం లో భాగంగా 2022 జనవరి ఒకటవ తేదీ నాటికి          18 సం.లు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డు) బి.ఎల్.ఓ.ల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్ లకు సూచించారు.

            బుధవారం హైద్రాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్. ఈ సందర్బంగా CEO మాట్లాడుతూ నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లు గా నమోదైన వారికి ఎపిక్ కార్డులు పంపిణీ తదితర విషయాల పై సూచనలు చేశారు. జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా ప్రస్తుతం కొత్తగా ఓటు హక్కు పొందిన యువతకు తమ ఎపిక్ కార్డు ను పోస్టు ద్వారా అందజేసే విధంగా చర్యలు తీసుకో వాలని కలెక్టర్లను సూచించారు. ఓటర్ కిట్ లో వ్యక్తిగత లేఖ,ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ,ఎపిక్ కార్డు కలిగి ఉంటుందని అన్నారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సం.లు నిండి ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఏకరీతిగా ఫోటోలు ఉన్న జాబితా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 

            ఈ నెల 17వ తేదీన ఆయా జిల్లాలకు సంబంధించిన ఎపిక్ కార్డులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి తీసుకువెళ్లాలని ఆదేశించారు. అదేవిధంగా ఈ.వి.యంలు భద్రపరచిన గోదాములను సందర్శిస్తూ ఉండాలని, కొత్త ఈ.వి.యం. భవనాలకు ఈ.వి.యం లు ఇంకా మార్చని వారు వెంటనే మార్చవలసిందిగా తెలియజేసారు. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఆన్లైన్ ద్వారా ఓటరు జాబితాలో తమ పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం, అవగాహన కల్పించాలని తెలిపారు. స్వీప్ యాక్టివిటి నిర్వహించి ఓటు హక్కు పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని తెలియజేసారు.

             రంగారెడ్డి జిల్లా నుండి జిల్లా రెవెన్యూ అధికారి (డి.ఆర్.ఓ.) హరిప్రియ మాట్లాడుతూ జిల్లాలో నూతన ఓటర్లు గా నమోదైన 4,217 మందికి జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి 25 నాటికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు తో పాటు, ఓటర్ కిట్ అందచేస్తామని తెలిపారు. ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరిస్తామని తెలిపారు.

              ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డి.ఆర్.ఓ. హరిప్రియతో పాటు ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

 

Share This Post