కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ-జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ-జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి, ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు ఎపిక్ కార్డులు బూత్ లెవల్ అధికారుల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్ లను కోరారు. బుధవారం నాడు ఆయన జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డుల పంపిణీ, తదితర విషయాలపై సూచనలు చేస్తూ, ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఓటర్ కిట్ కూడా జాతీయ ఓటర్ దినోత్సవం వచ్చే జనవరి 25 లోగా నూతనంగా నమోదైన ఓటర్లకు అందచేయాలని తెలిపారు. ఓటర్ కిట్ లో వ్యక్తిగత లేఖ, ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ, ఎపిక్ కార్డు కలిగి ఉంటుందని అన్నారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సంవత్సరాలు నిండి ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా నూతనంగా నిర్మించి ప్రారంభించుకున్న ఈ విఎం గోదాంలలోకి ఈ వి ఎంలు (బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లు )లను వారం లోగా తరలించాలని తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం ను కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహణ పై ఆయన అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
మేడ్చల్ నుండి అదనపు కలెక్టర్ రమేష్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మాట్లాడుతూ జిల్లాలోని మెదక్, నరసాపూర్ నియోజక వర్గాలలో కొత్తగా 4,769 మంది ఓటర్లుగా పేరు నమోదుచేసుకోగా, డూప్లికేట్, మరణించిన, నియోజక వర్గాలు మారిన తదితర 7,019 మంది ఓటర్ల పేర్లు తుది జాబితాలో తొలగించామని అన్నారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 4,11,270 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న 18-19 సంవత్సరాల వయస్సు గల 1,750 మంది యువత తమ ఓటరు ఎపిక్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి చే ప్రారంభించిన ఈ.వి.ఏం. గోదాముకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లు తరలించామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్.డి.ఓ. సాయి రామ్, స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post