ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత సంవత్సరంలో మంజూరైన 09 నూతన వైద్య కళాశాల నిర్మాణపు పనులపై జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.
రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న 09 వైద్య కళాశాల పనుల పురోగతిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులలు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, వైద్య ఆరోగ్యశాఖ సెక్రటరీ రిజ్వి లతో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా మంజూరైన వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులను నిర్వహించుకునే విధంగా జిల్లా కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. ఈ సంవత్సరం జూలై మాసం నుండి ప్రారంభమయ్యే తరగతులకు అనుగుణంగా నిర్మాణపు పనులకు అందరూ సమిష్టిగా కృషి చేసి ప్రారంభించుకున్నట్లయితే జిల్లాకు మంచి పేరు, ప్రతిష్ట వస్తుందన్నారు. ప్రతిరోజు నిర్వహించే పనుల పరిశీలనకు ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసుకొవాలని, అలాగే ప్రతి వారం జిల్లా కలెక్టర్లు కూడా చేపట్టిన పనులను పరిశీలిస్తూ ఉండాలని
మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మించే 09 వైద్య కళాశాల పనులను జాతీయ వైద్య కమిషన్ పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుందని మంత్రి అన్నారు. వైద్య కళాశాలలో అవసరమైన స్టాఫ్ నియామక ప్రక్రియ నెలన్నర కాలంలో పూర్తి చేస్తామని అన్నారు. వైద్య కళాశాలల నిర్మాణానికి ఏప్రిల్ మాసం చాలా కీలకమని, ప్రతిరోజు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆయన సూచించారు. జూలై నుంచి మొదటి విడత అడ్మిషన్స్ ప్రారంభం అయ్యే నేపథ్యంలో, వైద్య కళాశాలలను సన్నద్ధం చేసి ఎన్ఎంసి నుంచి అనుమతి సాధించాలని మంత్రి పేర్కొన్నారు. వైద్య కళాశాలలో చదివే పిల్లల కోసం ప్రత్యేకంగా 60 మంది మహిళలు, 40 మంది పురుషులకు సరిపడే విధంగా అన్ని సౌకర్యాలతో హాస్టల్ భవనాలను సమకూర్చాలన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి విజయవంతం చేయాలన్నారు. ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందరికీ అందజేయాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో గర్భిణీల కోసం టిఫా స్కానింగ్ యంత్రం అందుబాటులో ఉంచడం జరిగిందని, గర్భిణీ స్త్రీలు పరీక్షల నిర్వహణకు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో స్కానింగ్ చేయించుకునేలా
చూడాలన్నారు. ఆకస్మిక గుండెపోటు నివారణకు చేపట్టిన సిపిఆర్ శిక్షణ వివిద వర్గాల ప్రజలకు పకడ్బందీగా అందించాలని అన్నారు. సాధారణ ప్రసవాలు చేపట్టాలని, న్యూట్రీషియన్ కిట్స్ అన్ని జిల్లాలలో అందించడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, తరగతి గదుల పనులు పురోగతిలో ఉన్నాయని, ఏప్రిల్ 15 వరకు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఆసుపత్రి నిర్మాణ పనులలో భాగంగా మొదటి రెండవ అంతస్తులలో ప్లాస్టరింగ్ ఫ్లోరింగ్ పనులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు.
వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ మాట్లాడుతూ నిర్మాణపు పనులను అలాగే వసతి గృహానికి అవసరమైన భవనాలను పరిశీలించడం జరిగిందని, జిల్లా కలెక్టర్ సహకారంతో సకాలంలో పనులు పూర్తి చేస్తామని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పాల్వాన్ కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగమణి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఇఇ శ్రీనివాసులు, డీఈలు రవీందర్, లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.