కొనుగోలు కేంద్రాలు రైస్ మిల్లులను సందర్శించిన = కలెక్టర్ హరీష్

జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ మరింత వేగవంతం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ రమేష్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, ఆర్.డి.ఓ. శ్యామ్ ప్రకాష్, తహసీల్ధార్లతో కలిసి మనోహరాబాద్ మండలం దండుపల్లిలో, తూప్రాన్ మండలం యావాపూర్ లో, మాసాయిపేట లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు దండుపల్లి లో శ్రీహిత రైస్ మిల్లును, తూప్రాన్ లో సాయినాథ్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి కోతలు పూర్తయి చాలాచోట్ల ధాన్యం కుప్పలు కుప్పలుగా ఉన్నాయని, అధికారులు ధాన్యం సేకరణ ఒక యజ్ఞంలా భావించి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. తుఫాను ప్రభావంతో వర్షాలు పడే అవకాశమున్నందున కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, రైతులు కూడా అప్రమత్తంగా ఉంది ధాన్యం తడవకుండా కేంద్రాల నిర్వాహకుల నుండి టార్పాలిన్లు తీసుకొని వడ్ల కుప్పలపై కప్పవలసినదిగా సూచించారు. రైతులు అధైర్యపడవద్దని, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని, సంయమనం పాటించాలని కోరారు. కేంద్రాలకు 17 శాతం తేమ మించకుండా, తాలు లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. తడిసిన ధాన్యమైన ఆరబెట్టి తేమ లేకుండా కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలకు వస్తున్న ధాన్యాన్ని ఏ రోజుకారోజు తూకం వేసి వెను వెంటనే రైస్ మిల్లులలకు తరలించాలని నిర్వహకులకు సూచించారు. రైస్ మిల్లుల యజమానులు కూడా మిల్లు సామర్ద్యాన్నికనుగుణంగా గోదాములను ఎంగేజ్ చేసుకోవాలని, హమాలీలు ఎక్కువగా పెట్టుకొని ధాన్యం వచ్చిన 24 గంటలలోగా అన్ లోడ్ చేసుకోవాలని, ఎట్టి పరిస్థితులలో లారీలను వెయిటింగ్ లో పెట్టవద్దని సూచించారు. జిల్లాను రెండు క్లస్టర్ లు గా విభజించి ఒక్కో క్లస్టర్ కు 400 లారీలను కేటాయించామని, ఈ లారీలు కొనుగోలు కేంద్రంలో లేదా రైస్ మిల్లులో ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మూడు రోజులలోగా నివేదిక ఇవ్వవలసినదిగా ఆర్.డి.ఓ లను కలెక్టర్ హరీష్ ఆదేశించారు. బిల్లుల సత్వర చెల్లింపు కోసం ధాన్యం కొనుగోలు వివరాలు వెంటవెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు.
ఈ పర్యటనలో మనోహరాబాద్ తహసీల్ధార్ బిక్షపతి, మాసాయిపేట తహసీల్ధార్ మాలతి, డి.పి .ఏం., ఏ.పి .ఏం. వ్యవసాయ విస్తరణాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post