కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో వేగం పెంచాలి:: అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. సత్యప్రసాద్

ప్రచురణార్థం-2
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 3: రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియలో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ కోనరావుపేట మండలం నిమ్మపెల్లి, గొల్లపెల్లి, జై సేవలాల్ తండా, కోనరావుపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత మంది రైతుల వద్ద నుండి ఎన్ని క్వింటాళ్ల ధాన్యం సేకరించారనే వివరాలను ఆయన స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అందుకు సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలన్నారు. టార్పాలిన్లు, తూకం, తేమ పరీక్ష యంత్రాల పరిస్థితిని తెలుసుకున్నారు. రైతుల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ట్రక్ షీట్ ఎంట్రీ ఎప్పటికప్పుడు చేయాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, తహశీల్దార్ నరేందర్ తదితరులు ఉన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రాల తనిఖీ
కోనరావుపేట గ్రామంలోని గ్రామ పంచాయితీలో, కొలనూర్ గ్రామ పంచాయితీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. రెండవ డోస్ కు అర్హులై కూడా ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోని వారి వివరాలను సేకరించి వారి ఇంటికి స్వయంగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలని అన్నారు. వ్యాక్సిన్ వంద శాతం లక్ష్యం చేరుకునే దిశగా తగిన చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని ఆయన ఆదేశించారు.
ఈ తనిఖీలో ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, ఎంపీడీఓ రామకృష్ణ, తహశీల్దార్ నరేందర్ తదితరులు ఉన్నారు.

Share This Post