కొమురంభీం వర్థంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలోని జోడెఘాట్‌లో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న కొమురంభీం వర్ధంతి వేడుకలను సంబంధిత శాఖల అధికారులు, నిర్వహణ కమిటీ, ఆదివాసీ ప్రజలు సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో కొమురంభీం వర్ధంతి వేడుకల నిర్వహణపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్‌ ప్రాజెక్టు అధికారి భవేశ్‌మిశ్రా, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మీతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కొమురం భీం వర్ధంతి వేడుకల నిర్వహణలో అందరూ కలిసికట్టుగా పని చేయాలని, ఈ వేడుకలకు 35 వేల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందని, అధికారులు ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జోడేఘాట్‌ వెళ్లే రహదారి అవసరం ఉన్న చోట మరమ్మతులు చేపట్టాలని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలు తొలగించాలని, వేడుకల నిర్వహణ కమిటీ నియామకంలో అందరిని భాగస్వాములను చేయాలని తెలిపారు. జోదేఘాట్‌లో 50 నుండి 80 ఎకరాల స్థలంలో జల్‌-జంగల్‌-జమీన్‌ పేరుతో పార్కు ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే ప్రాజెక్టు తయారు చేసి కేంద్ర టూరిజం శాఖకు అందజేయడం జరిగిందని తెలిపారు. నాగాలాండ్‌, మిజోరాం రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలు ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తాయని, ఈ ఉత్సవాలను డాక్యుమెంట్స్‌ రూపంలో చేయడానికి ఇతర దేశాల నుండి అనేక మంది వస్తున్నారని, అదే తరహాలో అభివృద్ధి చేసే విధంగా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, నృత్య కళలు తెలిసేలా వేడుకలు నిర్వహించాలని, అన్ని రకాల హంగులతో పార్కు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జోదేఘాట్‌లో అసంపూర్తిగా ఉన్న రెండు పడక గదుల ఇండ్లకు సంబంధించిన 48 లక్షల రూపాయల నిధులు త్వరలో మంజూరు చేయడం జరుగుతుందని, అప్పటి వరకు పనులు కొనసాగించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్‌ నిధుల నుండి 10 లక్షల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జోడేఘాట్‌ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పర్యాటకులను వచ్చేలా ప్రోత్సహించడం జరుగుతుందని, ఇందుకు స్థానికుల సహకారం కావాలని, అందరు సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా పని చేయాలని తెలిపారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్‌ ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ వేడుకల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, వేడుకలకు వచ్చేవారు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, వైద్య సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండాలని, వర్షాకాలం సీజన్‌ కావడంతో అవసరమైన మందులతో సిద్దంగా ఉండాలని తెలిపారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అవ్వాల్‌ వేడుకలు నిర్వహించే ప్రాంతంలో రేకుల షెడ్ ఏర్పాటు చేయడంతో పాటు పెర్ఫాపెన్‌ దేవుడు దగ్గర భారీ వర్షాలతో చెడిపోయిన షెడ్‌ మరమ్మత్తు పనులను త్వరగా పూర్తి చేయాలని,
ముఖద్వారం వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వేడుకలలో విధులు నిర్వహించేందుకు అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి పరిశుభ్రంగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని, గత అనుభవాల దృష్ట్యా ప్రజా రవాణా కోసం అవసరం మేరకు ఆర్‌.టి.సి. బస్సుల సంఖ్య పెంచాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ డి.ఎస్‌.పి. శ్రీనివాస్‌, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్‌ కనక యాదవరావు, జిల్లా
గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి మణెమ్మ, కొమురం భీం మనుమడు సొనేరావు, జెడ్‌.పి.టి.సి.లు, ఆదివాసీ కమిటీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post