కొమురం భీం పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం : రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని జోడెఘాట్‌లో ఏర్పాటు చేసిన కొమురంభీం 81వ వర్థంతి కార్యక్రమంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు సోయం బాబురావు, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్‌ ప్రాజెక్టు అధికారి భవేశ్‌ మిశ్రా, శాసన మండలి సభ్యులు పురాణం సతీష్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కు, డి.సి.పి. సుధీంద్ర, ఆదివాసీ సంఘం గౌరవాధ్యక్షుడు, కొమురంభీం మనుమడు కొమురం సోనేరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఆదివాసీల సంక్షేమం కోసం జల్‌-జంగల్‌-జమీన్‌ నినాదంతో వీరోచిత పోరాటం చేశారని తెలిపారు. ఆదివాసీల స్వయం పాలన స్ఫూర్తి ప్రధాత కొమురం భీం ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, గిరిజన హక్కులు, స్వయం పాలన కోసం పోరాడిన కొమురం భీం కీర్తిని ఇనుమడింపచేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వం అధికారికంగా కొమురంభీం వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఆదివాసీల సంక్షేమం కోసం, ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జోదేఘాట్‌లో భీం సమాధి వద్ద స్మారక స్థూపంతో పాటు, భావితరాలకు చరిత్ర తెలియజేసే విధంగా మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రాంతాన్ని అన్ని హంగులతో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. 18 కోట్ల రూపాయలతో జోడేఘాట్‌ వరకు డబుల్‌ లైన్‌ బి.టి. రోడ్డు నిర్మించడం జరిగిందని, మిగిలిన పనులను త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గిరిజనులు సంప్రదాయ బద్ధంగా నిర్వహించే దండారీ వేడుకలకు ప్రభుత్వం కోటి రూపాయాలు మంజూరు చేయడం జరిగిందని, ‘మావనాటే మావరాజ్య” (మా ఊళ్లో మా రాజ్యం) అన్న ఆదివాసిల నినాదం మేరకు అడవుల్లో నివసిస్తున్న గిరిజన గూడాలు, తండాలను పంచాయతీలుగా గుర్తించి విశిష్ట అధికారాలు కల్పించడం జరిగిందని, ఆర్‌.ఓ. ఎఫ్‌. ఆర్‌. పట్టాలు ఉన్న గిరిజనులకు రైతుబంధు ద్వారా పంట సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని, అర్హత కలిగిన అందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ఆదివాసీలకు రెండు పడక గదుల పథకం వర్తింపజేయడం జరుగుతుందని, గిరిజన విద్యార్థులు విద్యనభ్యసించేందుకు వీలుగా వసతిగ్భహాల ఏర్పాటుపై పరిశీలించడం జరుగుతుందని, ‘పెర్ఫా పును, జంగు బాయి దేవాలయాలకు ఒక్కొక్కదానికి 10 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post