కోయంబత్తూర్ ఫారెస్ట్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న 45 మంది అటవీ అధికారుల (అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఏ.సీ.ఎఫ్ ) తమ క్షేత్ర పర్యటనలో భాగంగా తెలంగాణ సందర్శన.

దేశ అభివృద్ధిలో భాగం అవుతూనే, అడవులు- పర్యావరణం రక్షించే బాధ్యత ప్రతీ అటవీ అధికారికి ఉంటుందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు.

కోయంబత్తూర్ ఫారెస్ట్ అకాడెమీలో శిక్షణ పొందుతున్న 45 మంది అటవీ అధికారులు తమ క్షేత్ర పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చారు. వీరందరూ ఆయా రాష్ట్రాల్లో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏ.సీ.ఎఫ్)గా ఎంపికై కోయంబత్తూర్ లో శిక్షణ పొందుతున్నారు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తమిళనాడు, మిజోరం రాష్ట్రాలతో పాటు జమ్ము-కాశ్మీర్, లఢక్ లకు చెందిన శిక్షణ పొందుతున్న అధికారులు ఈ 45 మంది బృందంలో ఉన్నారు. వీరితో అరణ్య భవన్ లో జరిగిన సమావేశంలో పీసీసీఎఫ్ తో పాటు తెలంగాణ అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ అటవీ శాఖ అమలు చేస్తున్న హరితహారం, అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది, ప్రభుత్వం చేపట్టిన పలు రకాల ప్రాజెక్టులు, పథకాలకు అటవీ అనుమతులు, ప్రత్యామ్నాయ అటవీకరణ పద్దతులను అధికారులు వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యత, ప్రోత్సాహంతో అటవీ శాఖ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అటవీశాఖలో అధికారులుగా కొత్తగా బాధ్యతలు చేపట్టే శిక్షణార్థులు రానున్న తరాలకు పర్యావరణ వారధులుగా పనిచేయాలని, దేశ అభివృద్దిలో భాగం అవుతూనే అడవులను రక్షించే విధులను సమర్థవంతంగా చేపట్టాలని ఈ సందర్భంగా పీసీసీఎఫ్ ఆర్. శోభ ఆకాంక్షించారు. తెలంగాణలో తమ రెండు రోజుల పర్యటన ఫలవంతం అయిందని, అటవీ నిర్వహణలో సాంకేతికత వినియోగం, కంపాతో పాటు వివిధ పథకాల అమలు తీరును తెలుసుకున్నామని శిక్షణలో ఉన్న అధికారులు తెలిపారు.

సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్ ఏ.కే. సిన్హా, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, డీఎఫ్ఓ జోజి, ఓఎస్డీ శంకరన్, కోయంబత్తూరు అకాడెమీ అధికారి డాక్టర్ విద్యాసాగర్ పాల్గొన్నారు.

 

Share This Post