కోవిడ్ ఒమిక్రాన్ పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర పౌర సరఫరాలు & బి.సి సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్

పత్రికా ప్రకటన. తేదీ: 10-1-2022
కరీంనగర్

ఒమిక్రాని వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

కోవిడ్ సోకిన గర్భిణులకు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు

ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి.

కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి, రెండవ డోసుల పంపిణీలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానం

ఒమిక్రాన్ పై జిల్లా స్థాయి సమన్వయ సమీక్ష సమావేశం

పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, సి.పి., వివిధ శాఖల అధికారులు

0000

ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలు సిద్దంగా ఉంచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కోవిడ్, ఒమిక్రాన్ పై నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2019 సంవత్సరం మార్చి నెలలో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 10 నమోదు కాగా, వాటిని ధైర్యంగా ఎదుర్కొని కేసులు పెరుగకుండా కట్టడి చేశామని తెలిపారు. కరోనాను అరికట్టేందుకు మొదటి డోస్ వ్యాక్సినేషన్ లో 103 శాతంతో, రెండవ డోస్ వ్యాక్సినేషన్ లో 94 శాతంతో జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపినందుకు జిల్లా యంత్రాంగాన్ని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి అభినందించారు. 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల యువతకు ఇప్పటికే 50 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారి. ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వ్యాధి గ్రస్తులకు ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నామని మంత్రి తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకముందే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు. ఈ నెల 20 వ తేదీ వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, గుంపులుగా తిరగవద్దని మంత్రి తెలిపారు. పారిశుద్ద్యంపైన మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కరోనా. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ ల బారి నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో సున్నా కరోనా కేసులు ఉన్నాయని అన్నారు. ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్దంగా ఉంచాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు. కోవిడ్ సోకిన గర్భిణులకు మాతా శిశు సంరక్షన కేంద్రంలో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలోని 3 ప్రైవేట్ ఆసుపత్రులలో మాత్రమే ముగ్గురు కరోనా పేషెంట్లు ఉన్నారని, వారికి సరియైన చికిత్స అందిస్తున్నారని తెలిపారు. గత రెండు నెలల నుండి జిల్లాలో కరోనా కేసులు, మరణాలు లేవని తెలిపారు. ఈ నెల 13 న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగ ఉంటుందని, ఆలయాల్లో శానిటైజేషన్ చేయించాలని అధికారులకు సూచించారు. భక్తులను వరుస క్రమంలో ధర్శనానికి పంపించాలని అన్నారు. అనంతరం వైద్య శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులతో కరోనా, ఒమిక్రాన్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు.

జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ కరోనా మొదటి దశలో జాగ్రత్తలు, లాక్ డౌన్ నిర్వహించడం వల్ల కేసులు నమోదు కాలేదని, కరోనా రెండవ దశలో కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల కరోనా వ్యాప్తి చెందింధని అన్నారు. కరోనా కట్టడికి అందరు కలిసి పాటు పడాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కరోనాపై ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి ఫోన్ చేసినప్పుడు కాల్స్ రిసివ్ చేసుకుని వారికి తగిన సమాచారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించారు. ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ కరోనాను అరికట్టేందుకు వైద్య సిబ్బంది మంచి సేవలు అందించారని, అదే స్పూర్తితో ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మానకొండూర్ మండలం లక్ష్మిపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనం నిర్మించెందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.

ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ మాట్లాడుతూ వైద్యులను ప్రజలు దేవుళ్లుగా భావిస్తారని, వారికి వైద్య సేవలు అందించాలని అన్నారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల ప్రకారం ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలెటర్లు, పడకలు పూర్తిస్థాయిలో సిద్దంగా ఉన్నాయని అన్నారు. హుజురాబాద్, జమ్మికుంట ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని సౌకర్యాలని సిద్దంగా ఉంచామని తెలిపారు. ఏ.ఎన్.ఎం.లు, ఆశా వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏళ్లు పైబడి అనారోగ్యంతో ఉన్న వృద్దులకు బూస్టర్ డోస్ ఈరోజు నుండి అందిస్తున్నామని అన్నారు. 15 నుండి 18 సంవత్సరం గల వయస్సు వారందరికి కోవిడ్ వ్యాక్సినేషన్ అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల కోసం పిల్లల వైద్యులు ఉన్నారని అన్నారు. కరోనా, డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు పకడ్బంధీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు.

పోలిస్ కమిషనర్ వి. సత్యనారయణ మాట్లాడుతూ కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. మాస్కులు ధరించని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు, సంబరాలు నిషేధమని అన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి, సుడా చైర్మన్ జీ.వి. రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాం ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, జెడ్పి సి.ఈ.ఓ ప్రియాంక, ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, అడిషనల్ డి.సి.పి శ్రీనివాస్, జిల్లా అధికారులు, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

ఒమిక్రాని వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

Share This Post