కోవిడ్ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే – జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్

కోవిడ్ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే –    జిల్లా కలెక్టర్  ఎస్.హరీష్

కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గ్రామాల వారీగా, వార్డుల వారీగా టీం లను ఏర్పాటు చేసి ప్రతిరోజు 25 ఇండ్లలో ఇంటింటి సర్వే నిర్వహించాలని, ఈ కార్యక్రమం 3,4 రోజులలో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో సంబంధిత ఆశా వర్కర్/ ఏ.ఎన్.ఎం, మున్సిపల్/ గ్రామ పంచాయతి సిబ్బందితో టీం ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సర్వే టీంలు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ఎవరైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా అడిగి తెలుసుకోవాలని, కోవిడ్ లక్షణాలతో బాధపడే వారుంటే వారిని గుర్తించి హోమ్ ఐసోలేషన్ కిట్ ను ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్ లోని మందులు చాలా బాగా పనిచేస్తున్నాయని, 5 రోజులు వాడితే సరిపోతుందని ఆయన తెలిపారు. ఐసోలేషన్ కిట్ ఇచ్చిన వారిని సర్వే టింలు ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులలో చేర్పించాలని ఆదేశించారు. గత అనుభవంతో ఇంటింటి సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేయాలన్నారు. అదే విధంగా 15-17 సంవత్సరముల వారికి మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని అర్హులైన వారందరికి వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలని అన్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ ఓ.పి. సేవలను నిర్వహించాలని ఆదేశించారు. కోవిడ్ లక్షణాలున్న వారందరికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టెస్టింగ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్, మందుల నిల్వలు ఉన్నాయని, లేనిచో వెంటనే ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సౌకర్యంతో కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లతో రివ్యూ చేయాలని ఆదేశించారు. కోవిడ్ రోగులకు మంచి పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని అన్నారు. ప్రజలందరూ మాస్కులు ధరించేలా పోలిస్ కమిషనర్లు, పోలిస్ సూపరింటెండెంట్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో ఆశా/ ఏ.ఎన్.ఎం.లతో గ్రామ పంచాయతి కార్యదర్శి, ఇతర అధికారుల సమన్వయంతో ఇంటింటి జ్వరం సర్వేను విజయవంతం చేయాలని అన్నారు.
s రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ఇంతవరకు కోవిడ్ తో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించు ఎగ్జి గ్రేషియా (ఆర్థిక సహాయం) త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్స్ గ్రేషియా మంజూరుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఉన్నాయని, మీ సేవ ద్వారా ధరఖాస్తు చేసుకున్న కేసులను ఆ కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసి డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో ఉన్న రోగులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి డోసు 111 శాతం వేయగా, రెండవ డోసు 86 శాతం వేశామని అన్నారు. కాగా 15 నుండి 17 సంవత్సరాలలోపు వారికి 73 శాతం టీకా వేశామని, బూస్టర్ డోసుగా 3,617 మందికి కోవిడ్ టీకాలు వేశామని మంత్రికి తెలిపారు. ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా ఆశ వర్కర్లు, ఏ.యెన్.ఏం.లు, పంచాయతీ కార్యదర్శి, మునిసిపల్ సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందాలతో రేపటి నుండి అన్ని గ్రామాలలో ఇంటింటి జ్వర సర్వే చేపట్టి ఓమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలుంటే ఇంటివద్దనే ఐసోలేషన్ లో ఉండి వైద్యాధికారులు ఇచ్చిన మందులు వాడాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తరచూ చేతులను శుభ్రపర్చుకోవాలని అవగాహన కలిగిస్తామని అన్నారు. మెదక్, నరసాపూర్, తూప్రాన్, రామాయంపేట ఆసుపత్రులలో 170 ఐసోలేషన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. మెదక్ పట్టణంలో వంద పడకల ప్రత్యేక కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రికి వివరించారు. 24 ప్రభుత్వ ఆసుపత్రులు, 60 ప్రైవేట్ ఆసుపత్రులలో ఓ.పి . కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. కొవిడ్ బారిన పడిన చిన్నారులకు తక్షణ వైద్య సహాయం అందించుటకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వెంటిలేటర్ తో కూడిన 10 బెడ్లను సిద్ధంగా ఉంచామని అన్నారు. జిల్లా కేంద్రంలో ఆక్సిజెన్ ప్లాంట్ వల్ల ఆక్సిజన్ కు ఇబ్బంది లేదని కలెక్టర్ తెలిపారు. కోవిడ్ బారిన పది చనిపోయిన 328 కుటుంబాలకు త్వరలో ఎక్స్ గ్రేషియా అందించనున్నామని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post