కోవిడ్ నియంత్రణకు ఇంటింటి ఆరోగ్యం జ్వర సర్వే నిర్వహించాలి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ ఓ.పి. సేవలు అందించాలి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి ఆరోగ్యం జ్వర సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.
గురువారం రాష్ట్ర పంచాయతి రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గ్రామాల వారీగా, వార్డుల వారీగా టీం లను ఏర్పాటు చేసి ప్రతిరోజు 25 ఇండ్లలో ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో సంబంధిత ఆశా వర్కర్/ ఏ.ఎన్.ఎం, మున్సిపల్/ గ్రామ పంచాయతి సిబ్బందితో టీం ను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సర్వే టీంలు ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో ఎవరైన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా అడిగి తెలుసుకోవాలని, కోవిడ్ లక్షణాలతో బాధపడే వారుంటే వారిని గుర్తించి హోమ్ ఐసోలేషన్ కిట్ ను ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్ లోని మందులు చాలా బాగా పనిచేస్తున్నాయని, 5 రోజులు వాడితే సరిపోతుందని ఆయన తెలిపారు. ఐసోలేషన్ కిట్ ఇచ్చిన వారిని సర్వే టింలు ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులలో చేర్పించాలని ఆదేశించారు. గత అనుభవంతో ఇంటింటి సర్వేను పకడ్బంధీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వైద్యాధికారులను ఆదేశించారు. రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా 95 శాతంపైగా వ్యాక్సినేషన్ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉందని ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగానికి, వైద్యాధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. అదే విధంగా 15-17 సంవత్సరముల వారికి మొదటి డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ద తీసుకొని అర్హులైన వారందరికి వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలని అన్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికి బూస్టర్ డోస్ వేయించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ ఓ.పి. సేవలను నిర్వహించాలని ఆదేశించారు. కోవిడ్ లక్షణాలున్న వారందరికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందజేయాలని అన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టెస్టింగ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్, మందుల నిల్వలు ఉన్నాయని, లేనిచో వెంటనే ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సౌకర్యంతో కోవిడ్ వార్డులను ఏర్పాటు చేసామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లతో రివ్యూ చేయాలని ఆదేశించారు.ఆదేశించారు. కోవిడ్ రోగులకు మంచి పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని ఆదేశించారు. పోలిస్ కమిషనర్లు, పోలిస్ సూపరింటెండెంట్లు  ప్రజలందరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ ఆఫిసర్ ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటి సర్వే టీంలలో ఆశా/ ఏ.ఎన్.ఎం.లతో గ్రామ పంచాయతి కార్యదర్శి, ఇతర అధికారుల సమన్వయంతో ఇంటింటి జ్వరం సర్వేను విజయవంతం చేయాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ఇంతవరకు కోవిడ్ తో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించు ఎక్స్ గ్రేషియా (ఆర్థిక సహాయం) త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎక్స్ గ్రేషియా మంజూరుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఉన్నవని అన్నారు. మీ సేవ ద్వారా ధరఖాస్తు చేసుకున్న కేసులను కమిటీ వెంటనే పరిష్కరించి ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని అన్నారు. కోవిడ్ సెంటర్లలో ఉన్న రోగులకు పౌష్టికాహారంతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, తదితరులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నల్గొండ వారిచే జారీ చేయడమైనది.
కోవిడ్ నియంత్రణకు ఇంటింటి ఆరోగ్యం జ్వర సర్వే నిర్వహించాలి
వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి
అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ ఓ.పి. సేవలు అందించాలి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

Share This Post