కోవిడ్ నియంత్రణ చర్యల్ని పకడ్బందీగా అమలుచేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

కోవిడ్ నియంత్రణ చర్యల్ని పకడ్బందీగా అమలుచేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 3: ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపధ్యంలో పాఠశాలల్లో కోవిడ్ నియంత్రణ చర్యల్ని పకడ్బందీగా అమలుచేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ధర్మకoచ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలో తీసుకుంటున్న జాగ్రత్తలు, చేపట్టిన పారిశుద్ధ్య చర్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల తరగతి గదులు, వంటగది, టాయిలెట్లు, పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా చేపడుతూ, విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం కల్గించి హాజరు పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పునఃప్రారంభం లో ప్రస్తుతం జిల్లాలో సరాసరి 29.54 శాతం పిల్లలు ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 88 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తిచేసినట్లు, మిగతా వారికి వ్యాక్సినేషన్ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. జిల్లాలోని జూనియర్, డిగ్రీ, ఫార్మసీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులకు వ్యాక్సినేషన్ కు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలల్లో పారిశుద్ద్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆయన అన్నారు. పాఠశాలల పరిసరాలు, తరగతి గదులు, వంట గదులు ప్రతిరోజూ శుభ్రపరచాలని ఆయన తెలిపారు. శుద్ధమైన త్రాగునీరు అందించాలన్నారు. పాఠశాలల ఆవరణలో నీరు నిల్వఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలకు వచ్చే పిల్లలు, బోధనా, బోధనేతర సిబ్బంది అంతా ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలన్నారు. సానిటైజర్లు అందుబాటులో ఉంచడం, భౌతిక దూరం పాటించాలన్నారు. థర్మల్ స్కానర్ ద్వారా పిల్లల్ని పరీక్షించి అనుమతించడంపై కలెక్టర్ సంతృప్తి చెందడంతో పాటు, పాఠశాలలో పిల్లలకి ఎవరికైనా జ్వరం, జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలకు చర్యలు చేపట్టాలన్నారు. తరగతి గదుల్లో పిల్లలను భౌతిక దూరం పాటిస్తూ కూర్చుండబెట్టడం చేయాలని, మధ్యాహ్న భోజనం సమయంలో ప్రదేశం, విద్యార్థుల సంఖ్యను బట్టి, విడతలుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. టాయిలెట్ల పరిశుభ్రతకు డేటాల్, బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉంచుకోవడం, పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం చేయాలన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జిల్లా విద్యాధికారి కె. రాము, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. ప్రకాశం, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post