కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారి కాంటాక్టులు గుర్తించి వారికి టెస్టులు చేయాలి ఆర్టీపీసీఆర్ ల్యాబ్ తుది దశ పనులు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

ప్రచురణార్థం-2
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 27: కోవిడ్ పాజిటివ్ ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని, ఫీవర్ సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. అలాగే ఆ ప్రాంతంలో ఫీవర్ సర్వే నిర్వహించాలని అన్నారు. ఇతర దేశాల నుండి వచ్చే వారి సమాచారం సేకరించి వారు ఇంటినుండి బయటికి రాకుండా ఐసోలేషన్ లో ఉండేలా చూడాలన్నారు. అలాగే వ్యాక్సినేషన్ లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు రెండవ డోస్ కి అర్హులై కూడా ఇంకా వేసుకోని వారిని గుర్తించి ఈ నెల 31 వ తేదీలోగా వారందరికీ వ్యాక్సిన్ వేయాలని సూచించారు. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్ లో ఏర్పాటు చేస్తున్న ఆర్టీపీసీఆర్ ల్యాబ్ పనుల పురోగతిపై కలెక్టర్ ఆరా తీశారు. తుది దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, సిరిసిల్ల, వేములవాడ ఆసుపత్రుల పర్యవేక్షకులు డా. మురళీధర్ రావు, డా. మహేష్ రావు, డా. శ్రీరాములు, డా.రజిత, డా. మహేష్, డా.మీనాక్షి, మండల వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post