కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ లో వేగం పెంచాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 13: జిల్లాలో కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని చాంబర్ లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ రాపిడ్, జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3 లక్షల 22 వేల 409 రాపిడ్, 12 వేల 322 ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామన్నారు. జిల్లాలో కోవిడ్ పాజిటివ్ రేట్ 1 నుండి 1.5 శాతం ఉందన్నారు. జిల్లాలోని ప్రధాన ఆసుపత్రి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టినట్లు, కోవిడ్ ప్రమాద తీవ్రత ఉన్న వర్గాలను గుర్తించి, ప్రత్యేక శిబిరాలు నిర్వహించి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు లక్షా 26 వేల 925 మొదటి డోస్, 47 వేల 169 రెండో డోస్ వ్యాక్సిన్ ల పంపిణీ జరిగినట్లు ఆయన అన్నారు. విద్యా సంస్థల పునఃప్రారంభం, పండుగల సీజన్ కావున వైద్య శాఖ అప్రమత్తంగా వుంటూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పూర్తి చేయాలని ఆయన అన్నారు. సీజనల్ వ్యాధుల ప్రమాదం ఉన్నందున వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వుంటూ, మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, ఉప జిల్లా వైద్య, ఆరోగ్యాధికారులు డా. కరుణశ్రీ, డా. సుజిత్, డిఐఓ డా. రాము, ఎన్ఐడి డా. అశోక్, డా. ఛాయాదేవి, డా. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post