కోవిడ్ ఫ్రీ జిల్లాగా ప్రకటించే విధంగా వ్యాక్సిన్ పంపిణి జరగాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆదిలాబాద్ పట్టణంలో వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా ప్రణాళికలు రూపొందించుకొని నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున పట్టణం లోని తిరుపెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మహాలక్ష్మి వాడ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత నెల 16 నుండి జిల్లాలో ప్రత్యేక వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, గ్రామాలు, వార్డులలో అధికారుల టీమ్ లు ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ పై అవగహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పరచడం జరుగుచున్నదని తెలిపారు. ఇప్పటి వరకు మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగిందని, ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డులలో వ్యాక్సిన్ పంపిణి కార్యక్రమం వేగవంతం చేయాల్సి ఉందని, ప్రజలను చైతన్య పరచవలసిన అవసరం ఉందని అన్నారు. స్థానిక కౌన్సిలర్ లు ఆయా వార్డులోని ప్రజలతో మాట్లాడి వ్యాక్సిన్ తీసుకునే విధంగా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని తెలిపారు. ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ అందించే బాధ్యత మున్సిపల్ రిసోర్స్ పర్సన్ లపై ఉందని అన్నారు. వచ్చే పండగల లోగా వ్యాక్సిన్ పంపిణి వందశాతం నమోదు కావాలని జిల్లాను కోవిద్ ఫ్రీ గా ప్రకటించుకునే విధంగా మున్సిపల్, వైద్య, ఇతర శాఖల సిబ్బంది విధులు నిర్వహించాలని అన్నారు. ఇంటింటికి వ్యాక్సిన్ పంపిణి చేసేందుకు ఆటో లను సమకూర్చాలని మున్సిపల్ కమీషనర్ కు కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా మహిళలకు వ్యాక్సిన్ అందించే విధంగా చూడాలని, అదేవిధంగా ఇప్పటివరకు మొదటి డోస్ తీసుకున్న వారికీ రెండవ డోస్ నిర్ణిత సమయానికి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, మున్సిపల్ కమీషనర్ శైలజ, సానిటరీ ఇన్స్ పెక్టర్ నరేందర్, ఆయా వార్డ్ కౌన్సిలర్ లు, రిసోర్స్ పర్సన్ లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post