కోవిడ్ వాక్సిన్ తీసుకునేవిధంగా ప్రోత్సహించండి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 06, 2021ఆదిలాబాదు:-

            పంచాయితీ పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్ వాక్సిన్ తీసుకునేవిధంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున ఆదిలాబాద్ గ్రామీణమండలం లోని అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  మొదట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్ ను, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బంది, డిప్యుటేషన్, సెలవులపై ఉన్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి స్టోర్ రూమ్ లోని సరుకులను పరిశీలించారు. పిల్లలు అంగన్వాడీ కేంద్రాలకు పంపించే విధంగా చూడాలని, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను సద్వినియోగ పరచుకునే విధంగా పేద వర్గాల ప్రజలకు వివరించాలని సర్పంచ్ భూమన్న కు తెలిపారు. గ్రామంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరు వాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రంలో కిచన్ గార్డెన్ పెంచాలని, అందుకు సహకరించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రానికి సరఫరా అవుతున్న సరుకులు, పిల్లల హాజరు, పిల్లలకు అందిస్తున్న నిత్యావసర సరుకులకు సంబందించిన రికార్డు లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని కలెక్టర్ సందర్శించి అటవీ శాఖ, సిబ్బంది సహకారంతో సాంకేతిక సలహాలు తీసుకొని, అదనంగా ఉన్నటువంటి కొమ్మలను కత్తిరించి మొక్కల ఎదుగుదలకు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలపై సర్పంచ్ భూమన్నను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు తదితర ప్రాంతాలతో పాటు గ్రామంలోని అన్ని ప్రాంతాలలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరంగా కొనసాగించాలని అన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా రసాయనాలను పిచికారి చేయాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కతో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని, పౌష్టికాహారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post