కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యెక కార్యాచరణను వంద శాతం పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 19: కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక కార్యాచరణను వంద శాతం పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. ఆదివారం కలెక్టర్ పట్టణంలోని 18, 19, 25 వార్డులలో, రఘునాధపల్లి మండలం నిడిగొండలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల ఆకస్మిక తనిఖీ చేసి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ చక్కగా పనిచేస్తుందని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వచ్చినా ప్రాణాపాయం ఉండదని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, ఇంటికి దగ్గరలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని, వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చి, వ్యాక్సిన్ తీసుకొనేలా చైతన్యపరచాలని అన్నారు. ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టాలని, ఇంటిలో ఎందరు 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారు ఉన్నది, ఎంత మంది వ్యాక్సిన్ తీసుకున్నది, ఎంత మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి వున్నది స్పష్టంగా నమోదు చేసి, స్టిక్కర్ ను ఇంటి గడపకు అంటించాలన్నారు. రూపొందించిన షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని, ఏ రోజు, ఏ ప్రదేశంలో వ్యాక్సిన్ ఇస్తున్నది, ముందస్తుగా టాం టాం ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. వ్యాక్సిన్ కేంద్రాలలో కనీస మౌళిక సదుపాయాల కల్పన చేయాలని, వ్యాక్సినేషన్ విధుల నిర్వర్తనకు వచ్చిన సిబ్బందికి త్రాగునీరు, భోజన సదుపాయం కల్పించాలని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి, వంద శాతం వ్యాక్సినేషన్ ను కార్యాచరణ మేరకు పూర్తిచేయాలన్నారు.
కలెక్టర్ పర్యటన సందర్భంలో జనగామ ఆర్డివో మధు మోహన్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, జనగామ మునిసిపల్ కమీషనర్ నరసింహా, ఉప జిల్లా వైద్య, ఆరోగ్యాధికారులు డా. అశోక్ కుమార్, డా. కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారీచేయనైనది

Share This Post