కోస్గి వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్

పత్రిక ప్రకటన

తేది: 28-7-2021

నారాయణపేట జిల్లా.

ప్రభుత్వ ఆధీనంలో ఉండే వ్యవసాయ మార్కెట్ విధానమే శ్రేయస్కరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.  బుధవారం నారాయణపేట జిల్లాలో ఆబ్కారీ, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, కోస్గి శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి తో కలిసి కోస్గి వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  కోస్గి వ్యవసాయ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్బగా మంత్రి  కేంద్ర ప్రభుత్వము  తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు.  కేంద్ర ప్రభుత్వం మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకురావడం జరిగిందని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం నిలుపుదల చేసి ఉంచారన్నారు.  ఇందులో ఒకటవది నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టాన్ని రద్దు చేసి వ్యాపారులు తాము కొన్న సరుకును ఇష్టం వచ్చినంతగా నిలువ ఉంచుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు.  దీనివల్ల వ్యాపారులు అక్రమంగా సరుకులు దాచుకొని కృత్రిమ డిమాండ్ ను సృష్టించి అత్యధిక ధరకు అమ్ముకునే ప్రమాదం ఉందన్నారు.  రెండవది కాంట్రాక్టు వ్యవసాయ విధానమని, మూడవది వ్వ్యవసాయ ఉత్పత్తులను ఎవరు ఎక్కడైనా అమ్ముకునే, కొనుక్కునే అవకాశం ఉన్న చట్టాలను తీసుకువచ్చిందన్నారు.  అయితే ఇందులో ఏ వస్తువు ఇంతకు కొనాలి, రైతులు ఇంతకు అమ్మాలి అనేది లేదని అందుకే కనీస మద్దతు ధరను చట్టంలో పొందుపర్చాలని దేశవ్యాప్తంగా రైతులు ధర్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.  మన రాష్ట్రం 75 శాతం వ్యవసాయం పై ఆధారపడి ఉన్న రాష్ట్రమని అందుకే రైతాంగాన్ని కాపాడుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్లను కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.   తెలంగాణా రాష్ట్రం వచ్చాక వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది నేడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగామని తెలియజేసారు.  వ్యవసాయ అనుబంధ రంగాలు అభివృద్ధి చెందినందుకు రాష్ట్రంలో అనేక విధాలుగా ఉపాధి దొరుకుతుందని అన్నారు. రైతుబంధు కింద ఒక సీజన్ కు రూ. 7360 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు.  రాష్ట్రంలో ఐటీ రంగంలో15 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, తెలంగాణా రాష్ట్రం వచ్చాక 6 లక్షల ఐటి ఉద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని తెలియజేసారు.  కొడంగల్ శాసన సభ్యుల కోరిక మేరకు నియోజక వర్గంలో 40 వేల టన్నుల సామర్థ్యం కలిగిన 8 గోడములను నిర్మించేందుకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు తెలియజేసారు.  అదేవిధంగా కందుల ఆహార శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఒకప్పుడు రైతులు కలిసి వర్షాలు లేవని, కరెంటు లేదని, గిట్టుబాటు ధరలు లేవని అనేక కష్టాలు మాట్లాడుకునేవారని, కానీ తెలంగాణా వచ్చి ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర్ రావు వచ్చాక రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.  ఈ సంవత్సరం ధాన్యం అంచనాలకు మించి ఉత్పత్తి అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసిందన్నారు. అయితే రైతులు అందరూ ఒకే ధన్యం కాకుండా ప్రపంచ అవసరాలకు, డిమాండు ఉన్న పంటలను పండించాలని సూచించారు.  నూతన వ్యవసాయ విధానాలను అవలంభించాలని రైతులను కోరారు.  ప్రతి గ్రామంలో రైతు వేదికలు, వైకుంఠ ధమాలూ, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి ఇంటి ముందు మంచి నీటి నల్లాలు వచ్చాయని  పేర్కొన్నారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసి కోస్గి, కొడంగల్ కు క్రిష్ణా నదిని తీసుకువస్తామని తెలియజేసారు.

జిల్లా పరిషత్ చైర్మన్ వనజమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  నూతనంగా ఏర్పాటైన వ్యవసాయ మార్కెట్ కమిటీని శుభాకాంక్షలు తెలిపారు.

కోస్గి శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో మండలానికి రెండు ధాన్యం గిడ్డంగులు మంజూరు చేయాలని, ఈ ప్రాంతంలో కంది పంట సాగు అధికంగా ఉన్నందున కంది ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.

అంతకుముందు  కోస్గి  నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదక్షులుగా వీరారెడ్డి, ఉపాదక్షులుగా జి, వరప్రసాద్ ఇతర పాలక మండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.

అనంతరం బోగారం, గుండుమాల్ గ్రామాల్లో రైతు వేదికను, ఆమెలికుంట గ్రామమంలో 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషను ప్రారంర్భోత్సవం చేశారు.

అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, ఆర్.డి.ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ శిరీష,  మండల రైతు సమన్వయ సమీతి అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, జడ్పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద  సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

———————–

జిల్లా పౌర సంబంధాల అధికారి, నారాయణపేట ద్వారా జారీ.

Share This Post