@ ప్రజాభీష్టం మేరకే కొత్త మండలాలు.
@ కొత్త మండలాల ఏర్పాటుతో చేరువలో పాలన
@ అధికారులు అందుబాటులో ఉండటం వల్ల సత్వరం సేవలు
@ కౌకుంట్ల మండల తాసిల్దర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రజల సౌకర్యార్థం, వారి అభీష్టం మేరకు కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
బుధవారం దేవరకద్ర నియోజకవర్గం కౌంట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల తాహసిల్దార్, ఎంఈఓ, మండల వ్యవసాయ శాఖ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై కౌకుంట్లలో సైతం మిగతా మండలాల మాదిరిగా అన్ని ప్రభుత్వ సేవలు స్థానికంగానే అందుతాయని, ప్రభుత్వాధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. గతంలో ఎప్పుడు ఎండిపోయి ఉండే కౌకుంట్ల చెరువు ఇప్పుడు ఎండాకాలంలో కూడా నీటితో కళకళలాడుతోందని, భవిష్యత్తులో పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని కోనసీమలాగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. తన తండ్రి దివంగత నారాయణ గౌడ్ కౌకుంట్ల పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారని… అదే గ్రామం ఇప్పుడు మండలం అవ్వడం సంతోషాన్ని కలిగిస్తోందని మంత్రి తెలిపారు. మండలంగా మార్పు చెందడం వల్ల భూముల విలువ పెరగడంతో పాటు వేగంగా అభివృద్ధి చెందినందుకు అవకాశం ఏర్పడుతోందన్నారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, ఎంపీపీలు రమా శ్రీకాంత్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, జడ్పీటిసి అన్నపూర్ణ శ్రీకాంత్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జెట్టీ నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.