కౌన్సిలర్ లు, మతపెద్దల సహకారంతో కోవిడ్ వ్యాక్సిన్ లక్ష్యాలను సాధించవచ్చు- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

సెప్టెంబర్ 18, 2021ఆదిలాబాదు:-

ఆదిలాబాద్ పట్టణంలో 18 సంవత్సరాలు పైబడిన వారందరు వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు అవగహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముస్లిం, హిందూ మత పెద్దలు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ లతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించి కోవిడ్ వ్యాక్సినేషన్ పై పట్టణంలోని అర్హులైన వారందరు తీసుకునే విధంగా వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ వైరస్ సోకినా వారు మొదటి, రెండవ దశల్లో మరణించడం జరిగిందని, మరి కొంతమంది చికిత్సలు పొంది ఉపశమనం పొందారని అన్నారు. గతంలో తాను సిరిసిల్ల జిల్లాలో పని చేసిన సమయంలో కోవిడ్ మొదటి దశలో వైరస్ సోకిందని, ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందడం వల్ల వైరస్ నుండి బయట పడడం జరిగిందని తెలిపారు. వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లి రావడం వల్ల వైరస్ వ్యాప్తి జరిగే ఆస్కారం ఉందని తెలిపారు. అనుకోకుండా వైరస్ సోకడం జరిగి ప్రాణాలు పోవడం జరుగవచ్చని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వలన మరణాలను అరికట్ట వచ్చని అన్నారు. మన జిల్లా సరిహద్దున మహారాష్ట్ర ఉందని, ప్రభుత్వ గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో కోవిడ్ వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉందని, మన జిల్లా నుండి మహారాష్ట్ర కు రాకపోకలు జరగడం వలన వైరస్ మన జిల్లాలో ప్రబలే అవకాశం ఉంటుందని తెలిపారు. పట్టణంలోని ప్రజలందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే విధంగా ముస్లిం, హిందూ, ఇతర మతాల పెద్దలు, ఆయా వార్డుల కౌన్సిలర్ లు ప్రజలకు వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు వివరించినప్పటికీ ప్రజాప్రతినిధులు తెలపడం వలన అవగాహన కలగడం జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం సహజమని కనుక తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకునే విధంగా ఇంటింటికి తిరిగి వివరించాలని కోరారు. ప్రతి వార్డ్ లో వ్యాక్సిన్ కేంద్రాలను వైద్యం, అంగన్వాడీ, ఆశ, తదితర సిబ్బంది తో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం కింద పది రోజుల పాటు వ్యాక్సిన్ పంపిణీ చేయడం జరుగుచున్నదని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఆయా మతాల పెద్దలు ప్రజలకు వివరించడం ద్వారా వ్యాక్సినేషన్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి దుష్పరిణామాలు ప్రబలే ఆస్కారం లేదని, ఏమైనా అత్యవసర వైద్య సేవలు అవసరం ఉన్నట్లయితే 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ నంబర్ 7670904313 కు కాల్ చేసి సమస్యను తెలిపి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ జరిగే విధంగా ప్రజలను చైతన్య పరచాలని అన్నారు. ముఖ్యంగా పండుగల సమయం కనుక ఆయా ప్రాంతాలకు వచ్చే ప్రజలకు తెలియజేయాలని కోరారు. అవసరమైన పక్షంలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని మాట్లాడుతూ, ప్రభుత్వ యంత్రాంగానికి మత పెద్దలు సహకరించి ప్రభుత్వం చేపట్టే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ అనేది ఎవరికైనా ప్రభల వచ్చని, వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇప్పటివరకు ఎవరు కూడా మరణించలేదని తెలిపారు. ఈ వ్యాక్సిన్ సురక్షితం అని, థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని తెలిపారు. దీర్ఘ కాళికా వ్యాధులు కలిగి ఉన్నవారు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు. అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సాధన మాట్లాడుతూ, 18 సంవత్సరాలు పైబడిన వారందరు వ్యాక్సిన్ తీసుకోవచ్చని, గర్భవతులు, బాలింతలు, రక్త పోటు, చక్కర వ్యాధి గ్రస్తులు, హృదయ సంబంధ, మూత్రపిండాల సంబంధ వ్యాధులు కలిగి ఉన్న వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు. జ్వరం తో బాధ పడుతున్న వారు, కోవిడ్ వైరస్ సోకినా వారు వెంటనే తీసుకోకూడదని, జ్వరం తగ్గిన తరువాత, కోవిడ్ వైరస్ తగ్గిన మూడు నెలల తరువాత మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కోవిషిల్డ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, మొదటి డోస్ తీసుకున్న తరువాత రెండవ డోస్ 98 రోజుల అనంతరం తీసుకోవలసి ఉంటుందని వివరించారు. ఈ సమావేశాల్లో మున్సిపల్ కమీషనర్ శైలజ, వివిధ వార్డుల కౌన్సిలర్ లు, ముస్లిం, హిందూ మతపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post