క్రీడా స్ఫూర్తితో ఉద్యోగుల క్రీడా పోటీలు…..

ప్రచురణార్థం

క్రీడా స్ఫూర్తితో ఉద్యోగుల క్రీడా పోటీలు…..

మహబూబాబాద్, ఏప్రిల్ – 25:

జిల్లాలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు క్రీడా స్ఫూర్తితో జరుగుతున్నాయి.

సోమవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం, గిరిజన భవన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఐ.ఎం. ఏ. హాలులో ఉద్యోగులకు సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించారు.

నిత్యం విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులు అందరూ ఒక చోటికి చేరి జిల్లా అధికారులు, సిబ్బంది తమ హోదాలను మరిచి కలిసి కట్టుగా సాంస్కృతిక, క్రీడా పోటీల్లో పాల్గొన్నారు.

పాఠశాలలకు సెలవులు ఉండడంతో ఉద్యోగుల కుటుంబ సభ్యులు, పిల్లలు తమవారు పాల్గొంటున్న పోటీలను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమకు తాము మరిచి పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ, జిల్లాలో పని ఒత్తిడితో ఎప్పుడు టెన్షన్ వాతావరణంలో ఉండే వారి ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా కలెక్టర్ కె. శశాంక పోటీలను నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఆటలు ఆడే ప్రదేశాలలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేసి, మందులు, ఓ.ఆర్.ఎస్. ద్రావణం అందుబాటులో ఉంచారు.

సోమవారం సాయంత్రం పురుషుల క్రికెట్ లో ఫైనల్ కు చేరిన మంజీర, పాకాల టీముల ఉద్యోగులను అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అభినందిస్తూ, ఫైనల్ మ్యాచ్ టాస్ వేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకాల టీమ్ (81) పరుగులు చేయగా, అనంతరం మంజీర టీమ్ (79) పరుగులు చేశారు. పాకాల టీమ్ గెలుపొంది ప్రథమ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది.

ఉద్యోగుల క్రీడా పోటీలలో 12 టీముల వారీగా వివిధ శాఖల ఉద్యోగులు క్రికెట్, కబడ్డీ, వాలీ బాల్, త్రో బాల్, టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్, కేరొమ్స్, చెస్, స్లో సైక్లింగ్, సాక్ రేసింగ్, రన్నింగ్, షాట్ పుట్ పోటీలలో పాల్గొన్నారు.

అలాగే ఐ.ఎం.ఏ. హాలులో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సోలో, గ్రూప్ సాంగ్, సోలో, గ్రూప్ డాన్స్, కవిత్వం, మిమిక్రీ, మోనో, మైం పోటీలు నిర్వహించారు.

———————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post