ఖమ్మం నగరంలోని రామచంద్రయ్యనగర్లో ఇండ్లు కోల్పోయిన వారికి 15 రోజుల్లోగా పరిష్కారం చూపాలని జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి జిల్లా యంత్రాంగానికి సూచించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 11 ఖమ్మం:

ఖమ్మం నగరంలోని రామచంద్రయ్యనగర్లో ఇండ్లు కోల్పోయిన వారికి 15 రోజుల్లోగా పరిష్కారం చూపాలని జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి జిల్లా యంత్రాంగానికి సూచించారు. బాధితులకు ఇండ్లు తొలగించిన స్థలంలో గానీ, మరో ప్రాంతంలో గానీ పునరావాసం కల్పించాలన్నారు. జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి, కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి. బుధవారం ఖమ్మం నగరంలో పర్యటించారు. ముందుగా రామచంద్రయ్యనగర్ లో ఇండ్లు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. వారి ఇండ్లు తొలగించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టీటీడీసీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బాధితుల నుంచి అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి, సభ్యులు తల్లోజు ఆచారి రామచంద్రయ్యనగర్ వాసుల ఇండ్ల రెగ్యులరైజ్ ప్రక్రియ జరగపోవడానికి గల కారణాలను సంబంధిత అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ వివరిస్తూ గతంలో ఈ భూమిని ఎన్ఎస్సీ అధికారులు రెవెన్యూకు అప్పగించారని తెలిపారు. గతంలో రెండుసార్లు రామచంద్రయ్యనగర్ భూములపై కమిషన్ ఆధ్వర్యంలో హియరింగ్ జరిగిందన్నారు. గత ఏడాది జులైలో ఫస్ట్ నోటీస్ ఇచ్చామని, అక్టోబర్ లో రెండోసారి నోటీస్లు జారీ చేయడం జరిగిందని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. ఎలాంటి ఆధారం లేక 20 ఏళ్ల నుంచి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని ఉంటున్న వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం. చూపకుండా రాత్రికి రాత్రే ఎలా కూలగొడతారని బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ప్రజాపతి ప్రశ్నించారు. నిరుపేదలకు లాభం చేయడానికి ప్రభుత్వ అధికారులు సహకరించాలన్నారు.

ఇప్పటికే 25 మందికి వేరే చోట్ల పట్టాలిచ్చామని అధికారులు కమీషన్ దృష్టికి తెచ్చారు. జాష్యం చేస్తే కేంద్ర స్థాయిలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని అన్నారు. కమిషన్ వైస్ చైర్మన్, సభ్యులకు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ వివరిస్తూ కమిషన్ ఆదేశాల ప్రకారం 15 రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే 25 మందికి పట్టాలిచ్చామని, మిగిలిన అర్హులకు కమిషన్ ఆదేశాల మేరకు విచారణ జరిపి పునరావస ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు.

పోలీసు కమీషనర్ విష్ణు. యస్.వారియర్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జ్యోతి, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషన్ మల్లీశ్వరీ, అర్బన్ తహశీల్దారు శైలజ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post