ప్రచురణార్ధం
ఆగష్టు 21 ఖమ్మం:
ఖమ్మం నగరాన్ని బహిరంగ చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరంలోని వాణిజ్య, వ్యాపారం సముదాయాల నుండి చెత్తను సేకరించేందుకు ప్రత్యేక ఏజెన్సీను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ననుసరించి కమర్షియల్ ఏరియాలోని షాపుల నుండి చెత్త సేకరణకు గాను థర్డ్ పార్టీ ఏజెన్సీ ఎకోటెక్ ఎన్వీరో సొల్యూషన్ వారిచే చెత్త సేకరించే కార్యక్రమాన్ని శనివారం నగరంలోని గ్రాండ్ గాయత్రి హోటల్ వద్ద జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. అనంతరం యూజర్ కార్డులను మంత్రి దుకాణదారులకు అందజేశారు. కమర్షియల్ ఏరియాలోని షాపుల నుండి చెత్త సేకరించేందుకు దుకాణదారులు పాటించవల్సిన సూచనలపై నగరపాలక సంస్థ వారిచే రూపొందించిన కరపత్రాన్ని ఈ సందర్భంగా మంత్రి విడుదల చేసారు.
కమర్షియల్ ఏరియాలో షాపుల నుండి చెత్త సేకరణ గురించి నగర పాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి మంత్రికి వివరించారు. ప్రతి దుకాణం వద్దనే చెత్తను వేరు చేయుటకు దుకాణ దారులు వారి షాపులో తడిచెత్త కొరకు ఆకుపచ్చరంగు, పొడి చెత్త కొరకు నీలం రంగు, ప్రమాదకరపు చెత్తకొరకు ఎరుపు రంగు మూడు చెత్త డబ్బాలను ఏర్పాటు చేసుకొని తడి, పొడి చెత్తను వేరు వేరుగా చేయాలని, నగరపాలక సంస్థచే ఏర్పాటు చేయబడిన ఏజెన్సీకి ప్రతి దుకాణదారుడు తమ షాపులకు సంబంధించిన చెత్తను ఇవ్వాలని అందుకు గాను నిర్దేశించిన వినియోగచార్జీలు చెల్లించాలని, తెలంగాణ మున్సిపల్ చట్టం – 2019కి విరుద్ధంగా చెత్తను బహిరంగ ప్రదేశాలలో, మురికి కాలువలలో, షాపులముందు వేసిన బాధ్యులపై 5 వేల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు నెం 147 ననుసరించి ప్రతి దుకాణదారుడు ఆన్లైన్ ట్రేడింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని లేనియెడల అట్టి షాపులను సీజ్ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, స్థానిక కార్పోరేటర్ కర్నాటి క్రిష్ణ, నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరీ, స్థానిక ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.