ఖాళీ స్థలాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి :: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

ఖమ్మం, జూన్ 4:

ప్రయివేటు ఖాళీ స్థలాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టర్ శనివారం మధిర మునిసిపాలిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డుకు ఇరువైపులా చేపట్టిన మల్టీ లేయర్ ప్లాంటేషన్ ని జాగ్రత్తగా కాపాడాలన్నారు. మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు, గడ్డి తొలగించి శుభ్రం చేయాలని, సాసరింగ్ చేసి, సరిగ్గా నీరందేలా చూడాలని అన్నారు. అవసరమైన చోట ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రయివేటు వ్యక్తుల ఖాళీ స్థలాల్లో వారి అంగీకారంతో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. దీంతో ఆయా స్థలాలు పరిశుభ్రంగా ఉండడంతో పాటు రక్షణ కల్పించబడతాయని అన్నారు. భవిష్యత్తులో నిర్మాణాలు చేసే సమయంలో వారి స్థలాలు వారికి అప్పగించబడతాయని అన్నారు. ఓపెన్ ప్లాట్లలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి క్రింద పిల్లర్ల నడుమ సుందరీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. గ్రీనరీ, బస్ బే, పార్కింగ్, ఆటో స్టాండ్, సుందరీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. సెల్లార్ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లు వాహనాల పార్కింగ్ కు వినియోగించేలా వారికి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పబ్లిక్ టాయిలెట్లు శుభ్రంగా ఉంచి, వినియోగంలో ఉండేలా చూడాలన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి, ఆ స్థలంలో వీధి వ్యాపారులకు దుకాణాల సముదాయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. అనంతరం 18వ వార్డులో సైడ్ కాల్వల డిసిల్టింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌజులు, బూట్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలని ఆయన అన్నారు. అనంతరం మినీ స్టేడియం స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. స్టేడియంలో 200 మీటర్ల ట్రాక్ తో పాటు, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులు, 24×7 ఆడుకునేలా ఫ్లడ్ లైట్స్, ట్రాక్ చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేయాలని, నిర్మాణాలు 3 నెలల్లో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

కలెక్టర్ పర్యటన సందర్భంగా మధిర మునిసిపల్ చైర్ పర్సన్ ఎం. లత, పీఆర్ ఇఇ శ్రీనివాస్, మునిసిపల్ కమీషనర్ ఏ. రమాదేవి, మండల తహసీల్దార్ రాజేష్, మధిర ఆర్టీసీ డిపో మేనేజర్ దేవదానం, మునిసిపల్ ఏఇ నరేష్, టిపిఎస్ రమేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు వున్నారు.

Share This Post