ఖిల్లా ఘణపురం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వజ్రోత్సవ వేడుకలు : రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పత్రికా ప్రకటన      తేది:14.08.2022, వనపర్తి.

ఈ నెల తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.
ఆదివారం ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించిన వేడుకలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం అంటే మనల్ని మనం పరిపాలించుకోవడమని, స్వాభిమానం, మన ఆత్మాభిమానం అని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం లేకుంటే జీవితం లేనట్లు, స్వాతంత్ర్యం లేకుంటే ప్రాణంలేనట్లు, పరాయిపాలనలో ఉంటే బానిసలం అన్నట్లు, అందుకే స్వాతంత్ర్యం కోసం అన్ని కులాలు, వర్గాలు, మతాలకు అతీతంగా ప్రజలు పోరాడి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. అనేక లక్షల మంది జైళ్లకు వెళ్లారని, వెలకట్టలేని త్యాగాలు చేశారని, స్వాతంత్ర్యం సిద్దిస్తే భవిష్యత్ తరాలు బాగుపడతాయని నిస్వార్థంగా వారి సుధీర్ఘ పోరాటంతో స్వాతంత్ర్యం సిద్దించిందని విద్యార్థులకు ఆయన వివరించారు. 150 ఏళ్ల పాటు మన పూర్వీకులు వివిధ రూపాల్లో పోరాడితే 1947వ. సంవత్సరంలో మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆయన తెలిపారు.
1956లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో భారత రాజ్యాంగం రచించబడిందని, రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ప్రజలందరూ సమానమని, ఈ దేశంలో వనరులన్నీ సమానం అని ఆయన సూచించారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఉపాధి, విద్య, వైద్యం, న్యాయం, సంక్షేమం అందాలని సూచించిందని ఆయన తెలిపారు. నేడు తెలంగాణలో బడి ఈడు పిల్లలందరూ బడికి వెళ్తున్నారని, ఒకప్పుడు ఉన్న పరిస్థితి నేడు లేదని, ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే సదుద్దేశంతో విద్య, ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన అన్నారు.
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా ఖిల్లా ఘణపురం జడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రదర్శనలు అభినందనియమని ఆయన అన్నారు. ప్రస్తుత తరం బాలలకు పరిశీలన శక్తి, అవగాహనా శక్తి ఎక్కువగా ఉందని, చదువుతో పాటు మిగతా క్రీడల వైపు  విద్యార్థులను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. భావి పౌరులదే ఈ భవిష్యత్ అని, సమాజాన్ని అర్ధం చేసుకుని తల్లిదండ్రులు, తోటివారిని గౌరవిస్తూ ముందుకుసాగాలని ఆయన సూచించారు. వజ్రోత్సవ వేడుకల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
అనంతరం 44 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు రూ.లక్ష 116 చొప్పున, అదేవిధంగా 48 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి లబ్దిదారులకు రూ.15 లక్షల 17 వేల 500 లు విలువైన చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post