గణతంత్ర దినోత్సవానికి కలెక్టరేట్ ఆవరణలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి,
వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించిన అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గురువారం జరగనున్న గణతంత్ర దినోత్సవానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అందరికీ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.
బుధవారం శామీర్‌పేట కలెక్టరేట్ ఆవరణలో 74వ గణతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌తో కలిసి పరిశీలించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ఆవరణలో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనున్నందున ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో జాతీయ పతాకావిష్కరణ మొదలుకొని… సభావేదిక, సభాస్థలి, ఆవరణలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అలాగే గణతంత్ర దినోత్సవానికి కలెక్టరేట్‌కు వచ్చే వీఐపీలు, అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబాలు, మీడియా ప్రతినిధులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటితో పాటు కుర్చీలు, టెంట్లతో పాటు అన్ని సదుపాయాలు కల్పించినట్లు అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. ప్రజల కోసం కూడా ప్రత్యేకంగా కుర్చీలు, షామియానాలు, విద్యుత్తు లైట్లు, తాగునీటి సదుపాయాలు కల్పించామని… కార్యక్రమానికి వచ్చేందుకు, వెళ్ళేందుకు వేర్వేరుగా దారులు ఏర్పాటు చేసి బ్యారీకేడ్లు ఏర్పాటు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నర్సింహారెడ్డి తెలిపారు. అనంతరం సభావేదిక అలంకరణతో పాటు ఆయా విషయాలను అధికారులతో చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసమూర్తి, జిల్లా ఉద్యానవనశాఖ అధికారిణి నీరజాగాంధీ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి తనూజ, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.