గణేష్ నిమజ్జనాన్ని శాంతి యుతంగా నిర్వహించండి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 16, 2021ఆదిలాబాదు:-

వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా, సంయమనంతో పరస్పర అవగాహన తో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ నెల 19 న గణేష్ నిమజ్జనం సందర్బంగా గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన మాదిరిగానే ప్రభుత్వ శాఖల సమన్వయం, ఉత్సవ కమిటీ సహకారంతో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని శాంతి యుతంగా, సాంప్రదాయ రీతిలో నిర్వహించాలని అన్నారు. గత ఏడాదిన్నర కాలం కోవిడ్ వలన ప్రజలు ఎన్నో సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ప్రస్తుతం కోవిడ్ ఫ్రీ కారణంగా పండుగలను కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహించుకుంటున్నామని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, అగ్నిమాపక, మత్స్య శాఖ, రోడ్లు భవనాలు, మున్సిపల్, అబ్కారీ, వైద్య శాఖలు ఆయా శాఖల పరంగా ఏర్పాట్లను నిర్వహించాలని అన్నారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగ కుండా ఉత్సవ కమిటీ గణేష్ మండళ్లకు ముందస్తు సూచనలు అందించాలని అన్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, ఈ సంవత్సరం గతంలో కంటే ఎక్కువ మండళ్లలో గణేష్ విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందని తెలిపారు. రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగ కుండా సహకరించాలని అన్నారు. మద్యం రవాణా కాకుండా అబ్కారీ అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. విగ్రహ నిమజ్జనం సందర్బంగా పెన్ గంగా వద్ద చిన్న పిల్లలను, ముసలి వాళ్ళను అనుమతించబోమని తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో గజ ఈతగాళ్లను నియమించడం జరుగుతుందని తెలిపారు. వాహనచోదకులను మంచి వాళ్ళను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం డీజే లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డీజే లు ఏర్పాటు చేస్తే సీజ్ చేయడం తో పాటు కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. విగ్రహాల శోభాయాత్ర సందర్బంగా విద్యుత్, టెలికమ్, ఇంటర్నెట్, కేబుల్ నెట్వర్క్  వైర్లను సరిచేయడానికి సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్నారు. ఎలాంటి వైర్లను తొలగించకూడదని సంబంధిత వారికీ తెలియజేయాలని ఉత్సవ కమిటీ సభ్యులకు తెలియజేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సిసి కెమెరాలు, మొబైల్ టీమ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అత్యవసర సేవలనందించేందుకు ఆయా శాఖల అధికారుల పేర్లు, కాంటాక్ట్ నంబర్ లు తెలియజేయడం తో పాటు ముఖ్య ప్రాంతాల్లో ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మిగితా గ్రామాల్లో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో లైటింగ్, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ ను కోరారు. అంతకు ముందు ఆయా శాఖలు చేపట్టే కార్యక్రమాలపై అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ శాఖల వారీగా విధులను నిర్వహించాలని అన్నారు. అబ్కారీ SI మాట్లాడుతూ, 18 వ తేదీ సాయంత్రం నుండి 20 వ తేదీ ఉదయం 11 వరకు బార్లు, వైన్ షాపులు మూసి ఉంచడం జరుగుతుందని తెలిపారు. DSP వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, నమాజ్ చదివే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విగ్రహాలు త్వరగా నిమజ్జనం చేసే విధంగా ఆయా మండళ్ళ వారు సహకరించాలని అన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తమ్ జాడే మాట్లాడుతూ, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, సిబ్బంది అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అగ్నిమాపక శాఖ ద్వారా అంబెడ్కర్ చౌక్, గోపాల కృష్ణ మందిర్, పెన్ గంగ అగ్నిమాపక మోటర్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ శాఖ ద్వారా లైటింగ్, సౌండ్ సిస్టం, క్రేన్, రోడ్లపైన ఉన్న గుంతల్లో మట్టి వేయడం, తదితర పనులు నిర్వహిస్తామని మునిసిపల్ కమీషనర్ శైలజ తెలిపారు. వైద్య శాఖ ద్వారా ప్రత్యేక సిబ్బందిని నియమించి మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేస్తామని ఆ శాఖ అధికారి తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ జాడి రాజేశ్వర్, ఉత్సవ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post