గత రెండు సంవత్సరాలు నుండి కరోనా వల్ల ఇబ్బందులున్నా వైద్య సిబ్బంది అధిగమించి పెద్దఎత్తున వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి అభివృద్ధి సంఘం ఛైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య తెలిపారు.

గురువారం కలెక్టరేట్ సమావేశపు హాలులో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను కమిటి దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిరుపేదలు అధికంగా నివసిస్తున్న మన జిల్లాకు ప్రభుత్వం వైద్య, నర్సింగ్ కళాశాలలు మంజూరు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురాకపోవడం వల్ల జాప్యం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆసుపత్రుల్లో జరుగుతున్న పనులను కమిటీ సభ్యులకు తెలియచేయడం వల్ల పనులు వేగవంతంగా పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పట్ల భరోసా ఉండాలని చెప్పారు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నదని, ఇటువంటి సంస్కృతిని విడనాడాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల ఆశయం ఒక్కటే ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పారు. వైద్య సేవలకు వచ్చే రోగుల పట్ల గౌరవంగా ఉండాలని, వ్యాధితో వస్తే కోపగిస్తే వారిలో మనోధైర్యం దెబ్బతింటుందని, కాబట్టి సంయమనంతో మెలగాలని చెప్పారు. కొత్తగూడెం ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించని కాంట్రాక్టరుపై చర్యలు తీసుకుంటామని, నివేదికలు అందచేయాలని పర్యవేక్షకులను ఆదేశించారు. రామవరం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సిటి స్కాన్ యంత్రం ఏర్పాటు చేయుటకు. చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రామవరంలో నిర్మిస్తున్న మాతా శిశు ఆసుపత్రి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని, పెండింగ్ ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. ప్రహరి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి మూడు నెలలు అవుతున్నా ఎందుకు పనులు పూర్తి చేయలేదని టిఎస్యంఎస్ఎసి ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా ఉపయోగకరమైన ప్రాజెక్టు అని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాధాన్యతను గుర్తించాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. సమయపాలన అత్యంత ముఖ్యమని, సమయపాలన చాలా ముఖ్యమని, సమయానికి రాలేదని, అందుబాటులో లేరనే పిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రమం తప్పక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలు నిర్వహించాలని, సభ్యులకు వారం ముందుగా తెలియచేసి నివేదికలు అందచేయాలని చెప్పారు. విధులు నిర్వహించు సిబ్బంది డ్యూటి చార్టులు ఏర్పాటు చేయడంతో పాటు ఫోన్ నెంబర్లు తెలియచేయాలని చెప్పారు. ఆసుపత్రుల్లో పిర్యాదుల ఫోన్ నెంబరు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆసుపత్రులు పరిశుభ్రంగా ఉండాలని చెప్పారు. ఆసుపత్రిలో మురుగునీటి సమస్యతో పాటు సిసి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పారు. కమిటీసభ్యులు మున్సిపల్ చైర్మన్ సీతాలక్ష్మి, జడ్పీటిసిలు పైడి వెంకటేశ్వరావు, తెల్లం సీతమ్మ, యంపిపి చీమల నాగరత్నం, డాక్టర్ కాంతారావు, వర్దన్ రావు, మహిళా సమాఖ్య అధ్యక్షరాలు గొర్రెల సునీత, యన్టిజిఓ వడ్డెం సతీష్ కుమార్ మాట్లాడుతూ నెలలో రెండు రోజులు కార్పోరేట్ స్థాయిలో ప్రత్యేక నిపుణులతో హెల్త్ క్యాంపు నిర్వహించుటకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కొత్తగూడెం ఆసుపత్రిలో అంబులెన్సు డ్రైవర్ను తక్షణం ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు శిరీష, ముక్కంటేశ్వరావు, సరళ, విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post