సెప్టెంబర్ 07, 2021 – ఆదిలాబాదు:-
గర్భిణీలకు ప్రతి నెల పరీక్షలు నిర్వహించాలని, పరీక్షలకు రాని గర్భిణీలను గుర్తించి మరొక రోజు పరీక్షలు నిర్వహించే విధంగా ట్రాక్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం రోజున ఇచ్చోడ మండలం నర్సాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట ఆసుపత్రిలోని వార్డులను చికిత్సలు, పరీక్షలు నిర్వహించే గదులను, మెటర్నటీ వార్డును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గర్భిణీలకు ప్రతి నెల నిర్వహించే పరీక్షలను యధావిధిగా కొనసాగిస్తూ, ఆ నెలలో వైద్య పరీక్షకు హాజరు కానీ గుర్తించి తదుపరి సోమవారం జరిగే రోజున విద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఆ నెల లో వైద్య పరీక్షకు హాజరు కానీ వారిని గుర్తించే విధంగా ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. పరీక్షకు హాజరు కానీ గర్భిణీలను కాల్ సెంటర్ ద్వారా తెలియపరచి వైద్య పరీక్షకు హాజరు అయ్యే విధంగా సలహాలు అందించాలని అన్నారు. వైద్య పరీక్షలకు హాజరు కానీ గర్భిణీలు ఏ కారణం చేత హాజరు కాలేదో సంబంధిత ANM వివరాలు సేకరించాలని, స్థానికంగా లేనట్లయితే ఆయా గర్భిణీ ఏ ప్రాంతానికి వెళ్ళింది అనే వివరాలను స్థానిక సర్పంచ్ లేదా గ్రామస్తులను విచారించి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. అట్టి గర్భిణీ వెళ్లిన ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేసుకునే విధంగా ఫోన్ ద్వారా తెలియపరచాలని అన్నారు. వర్షాకాలంలో రవాణా సౌకర్యం లేని గ్రామాలలోని గర్భిణీలను ప్రసవ సమయానికి ముందే ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం నకు గాని లేదా సమస్యాత్మక ఆరోగ్యం దృష్ట్యా రిమ్స్ కు తరలించాలని ఆదేశించారు. అందుకు ఆయా ఆశ, ANM లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రసవ సమయాలను స్పష్టంగా తెలుసుకొని ANM లు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రసవం అనంతరం వివరాలు ఆన్ లైన్ లో పొందు పరచాలని సూచించారు. ప్రాథమిక కేంద్రాల పరిధిలోని మెడికల్ ఆఫీసర్ లు వారి ప్రాంతంలోని గర్భిణీల వివరాలు, పరీక్షలు నిర్వహించిన సమాచారం పూర్తిగా తెలిసి ఉండాలని అన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో 15 పడకలు గల వార్డును గర్భిణీల కోసం వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాలనీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. అట్టి వార్డులోని గర్భిణీలకు గైనకాలోజిస్ట్ వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో కోవిడ్ -19 వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలను ప్రణాళికలతో నిర్వహించాలని అన్నారు. గ్రామాలలో ఇప్పటి వరకు 18 సంవత్సరాలు నిండిన వారు, వ్యాక్సిన్ తీసుకొని వారి వివరాలను సేకరించి వ్యాక్సిన్ అందించాలని అన్నారు. అదేవిధంగా మొదటి డోస్ తీసుకొని రెండవ డోస్ కోసం రాని వారిని కూడా గుర్తించి వ్యాక్సిన్ అందజేయాలని అన్నారు. మెడికల్ ఆఫీసర్ లు, సిబ్బంది బయో మెట్రిక్ అటెండెన్స్ నిర్వహించాలని అన్నారు. బయో మెట్రిక్ హాజరు ప్రక్రియ లేనట్లయితే ఆసుపత్రి లొకేషన్ లో సెల్ఫీ తీసుకొని వాట్సాప్ గ్రూప్ లో అప్ లోడ్ చేయాలని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు ప్రబలకుండా గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, ప్రోగ్రాం ఆఫీసర్ నవ్య సుధ, మెడికల్ ఆఫీసర్ హిమబిందు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎంపీడీఓ రామ్ ప్రసాద్ ను ఆదేశించారు. నర్సాపూర్ గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం లేదని గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా గ్రామం లోని నాళిలను కలెక్టర్ పరిశీలించారు. పంచాయితి కార్యదర్శి ప్రతి రోజు గ్రామా సందర్శన చేసి మల్టి పర్పస్ కార్మికుల ద్వారా పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించే విధంగా చూడాలని ఆదేశించారు. వర్షాకాలం లో వర్షపు నీరు మురికి కాలువల గుండా ప్రవహించే విధంగా నాలీలలోని చెత్తను తొలగించాలని అన్నారు. గ్రామాలను సుందరంగా ఉంచే బాధ్యత పంచాయితీ కార్యదర్శులపై ఉందని గుర్తు చేశారు. చెత్త చెదారం వలన మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.