గర్భిణీ, బాలింతలకు పోషకాహార లోపం వల్ల జరిగే అంర్థాల పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించలి జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి

పత్రికా ప్రకటన
తేది: 8-9-2021
నాగర్ కర్నాల్ జిల్లా.
గర్భిణీ, బాలింతలకు పోషకాహార లోపం వల్ల జరిగే అంర్థాల పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు నిర్వహించనున్న పోషణ్ అభియాన్ కార్యక్రమము పై జిల్లా స్థాయిలో కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈసందర్బంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు ఎటువంటి పౌష్టికాహారం తీసుకోవాలి అనేది వారికి అవగాహన కల్పించాలన్నారు. పిల్లల పరిశుభ్రత, వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి వారి ఎదుగుదల సరిగ్గా లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి జిల్లాలో అనిమియాతో ఎవరు బాధపడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలు ఇప్పుడే ప్రారంభమైనందున లైన్ డిపార్ట్మెంట్ వారు తమ తమ బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. మొత్తం ఎన్ని అంగన్వాడీ లు ఉన్నాయి, ఎన్ని పాఠశాలలు ఉన్నాయి వాటిలో ఎన్నింటిలో న్యూట్రీ గార్డెన్ ( పెరటి తోటలు) ఉన్నాయి అనేది పూర్తి నివేదిక ఫొటోలతో సహా ఇవ్వాలని జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా విద్య శాఖాధిరిని ఆదేశించారు. వంద శాతం న్యూట్రీ గార్డెన్ సాధించడానికి అవరోధాలు ఎమున్నాయో నివేదిక ఇవ్వాలని సూచించారు. అన్ని విద్యా సంస్థలలో పారిశుధ్యం వంద శాతం అయ్యిందా లేదా, చెత్తకుప్పలు ఇంకా ఉన్నాయా బ్లీచింగ్ చేసారా లేదా, మంచి నీటి ట్యాన్క్ లు శుభ్రం చేసారా లేదా వంట గది, భోజనం చేసే ప్రాంగణం పరిశుభ్రం చేసారా లేదా ప్రస్తుత పరిస్థితి ఏమిటీ అనేది ఫొటోలతో సహా పూర్తి నివేదిక ఇవ్వాలని పంచాయతీ రాజ్, జడ్పి సి.ఈ.ఓ, డిఆర్డీఓ, మున్సిపల్ అధికారులను బాధ్యత అప్పగించారు. ఏమైనా రిపేర్లు అవసరం ఉందా, విద్యుత్ కనెక్షన్లు పరిస్థితి ఏంటి, ఓవర్ హెడ్ ట్యాన్క్ లు ఉన్నాయా లేవా పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. మొత్తం అంగన్వాడీ, పాఠశాలల్లో ఎన్నింటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉన్నాయి అనేది పూర్తి నివేదిక నల్లా నడిపించి నీళ్లు వస్తున్న ఫోటో తో సహా నివేదిక ఇవ్వాల్సిందిగా ఇ.ఇ ఇంట్రా అధికారిని ఆదేశించారు. అనిమియాతో బాధ పడుతున్న పిల్లలు లేదా ఇతర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి వారి పేర్లు, సమస్యలు నివారణకు తీసుకోబోయే చర్యలపై పూర్తి సర్వే అనంతరం నివేదికను జిల్లా సంక్షేమ అధికారికి, తనకు కాపీ ఇవ్వడమే కాకుండా గూగుల్ స్ప్రెడ్ షీట్ లో పొందు పరచాలని ఆర్.బి.ఎస్.కె అధికారిని ఆదేశించారు. గర్భం ధారణ సమయం నుండి 1000 రోజులు వరకు గర్భిణీలు, పిల్లలు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి, పరిశుభ్రత విషయమై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ పోషణ్ అభియాన్ సందర్బంగా అన్ని గ్రామాలు, హాబీటేషన్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా సంక్షేమ అధికారిని ఆదేశించారు. ఆయుష్ విభాగం సహాయంతో గ్రామాల్లో మహిళలకు యోగ శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు.
కార్యక్రమంలో పాల్గొన్న పదర మండల జడ్పిటిసి రాంబాబు మాట్లాడుతూ కొని పాఠశాలకు నల్లా కనెక్షన్లు లేవని , కొన్ని చోట్ల ఎక్కువ పిల్లలు ఉన్నా ఒకే నల్లా కనెక్షన్ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ పూర్తి పర్యవేక్షణ చేసి ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని ఈ.ఈ ఇంట్రా అధికారిని ఆదేశించారు. అనంతరం పోషణ్ అభియాన్ పోస్టర్ విడుదల చేసారు.
ఈ సమావేశం లో జిల్లా సంక్షేమ అధికారిణి వెంకటలక్ష్మి, డి.ఈ.ఓ గోవిందరాజు, డి.యం.హెచ్.ఓ సుధాకర్ లాల్, పిడి డిఆర్డీఓ నర్సింగ్ రావు, ఈ.ఈ ఇంట్రా శ్రీధర్ రావు, డిపిఓ రాజేశ్వరి, జడ్పి సిఇఓ బి.ఉషా అందరూ ఆర్.డి.ఓ లు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
——————–
జిల్లా పౌర సంబంధాల అధికారి నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post