గర్భిణులు, బాలింతలకు పోషకాహారం పై అవగాహన కల్పించాలి::జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

గర్భిణులు, బాలింతలకు పోషకాహారం పై అవగాహన కల్పించాలి::జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 13: గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై అవగాహన కల్పించుటకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోషణ్ అభియాన్ కార్యక్రమంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు ప్రారంభమైనందున సంబంధిత విభాగాలు తమ తమ బాధ్యతలు నిర్వర్తించాలన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు ఎన్నిటిలో న్యూట్రీ గార్డెన్స్ ఉన్నది నివేదిక సమర్పించాలని ఆయన అన్నారు. విద్యా సంస్థల ఆవరణలో పోషకరమైన పండ్ల మొక్కలు, కూరగాయలు, ఔషధ, మూలికల మొక్కలు నాటాలన్నారు. వంద శాతం న్యూట్రీ గార్డెన్ల ఏర్పాటుకు అవరోధాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన తెలిపారు. విద్యా సంస్థల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన త్రాగునీటి సరఫరా జరగాలన్నారు. పిల్లల పరిశుభ్రత, వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి, వారి ఎదుగుదల సరిగ్గా లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనిమియా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లల వివరాలు, సమస్యల పరిష్కారానికి తీసుకోబోయే చర్యలపై నివేదిక సమర్పించాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి, పరిశుభ్రత పై, పోషణ్ అభియాన్ పై గ్రామాలు, అవాసాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నుండి స్వయం సహాయక, ఐకెపి సంఘాలు, పంచాయతీరాజ్ నుండి కార్యదర్శులు, ఆశ వర్కర్లు విస్తృత ప్రచారం చేపట్టి, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మొదటి వారం పాఠశాలల్లో వ్యాస రచన, డ్రాయింగ్, న్యూట్రీషన్ ఫెయిర్ పోటీలు, పిల్లలకు సమతుల్య ఆహారం గురించి అవగాహన, రెండో వారంలో తల్లి పాల ప్రాముఖ్యత, ఐవిసిఎఫ్ ప్రాక్టీసు గురించి అవగాహన కల్పించడం, వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో శిబిరాలు నిర్వహించడం, మూడో వారంలో న్యూట్రీ గార్డెన్ల పెంపొందించే విధంగా చర్యలు, యోగా వలన కలిగే లాభాలు గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పోషణ్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, జిల్లా సంక్షేమ అధికారిణి జయంతి, జెడ్పి సిఇఓ ఎల్. విజయలక్ష్మి, డిఆర్డీవో జి. రాంరెడ్డి, డిపివో రంగాచారి, డిఎం&హెచ్ఓ డా. ఏ. మహేందర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post