గిరిజన, గిరిజనేతరులకు పోడుభూములపై శాశ్వత ప్రతిపాదనలు,అర్హులైన వారందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీ, నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి మల్లారెడ్డి

గిరిజన, గిరిజనేతరులకు పోడుభూములపై శాశ్వత ప్రతిపాదనలు
అర్హులైన వారందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు
రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీ, నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజనులు, గిరిజనేతరులకు సంబంధించిన గత కొద్ది సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పోడు భూముల విషయంలో వారికి తగిన విధంగా న్యాయం చేయడంతో పాటు శాశ్వత అటవీ హక్కు పత్రాలు పొందని వారికి వాటిని అందించనుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీ, నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
సోమవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హరీష్ అధ్యక్షతన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎం.శరత్చంద్రారెడ్డి ఆధ్వర్యంలో అటవీ, గిరిజన అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో పోడుభూముల సమస్య పరిష్కారం – అటవీ సంరక్షణ అంశాలపై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ అటవీ భూములను గిరిజనులు, వారితో పాటు ఇతర వర్గాల వారు గత కొద్ది సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వారికి న్యాయం చేసే విధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా పోడు భూములను సాగు చేస్తూ ప్రభుత్వం అటవీ హక్కు పత్రాలు పొందని గిరిజన, గిరిజనేతరులకు న్యాయం కల్పించడంతో పాటు అడవుల సంరక్షణతో పాటు అడవుల పునరుజ్జీవనానికి శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఎంతో చిత్తశుద్దితో కృషి చేస్తోందన్నారు. దీంతో పాటు అటవీ, పోడు భూముల శాశ్వత పరిష్కారానికి, అడవులను సంరక్షించుటకు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారని మంత్రి మల్లారెడ్డి వివరించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పోడు భూమలు పలువురు సాగు చేస్తున్నట్లు సంబంధిత శాఖల అధికారులు గుర్తించారని వీటిని సాగు చేస్తున్న నిజమైన గిరిజన, గిరిజనేతరులకు ఆర్ఓఎఫ్ పట్టాలు అందించడంతో పాటు మున్ముందు అటవీ భూములు ఆక్రమణలు జరుగకుండా, వాటి పునరుజ్జీవనానికి అటవీ రక్షణ చట్టం అమలుపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆక్సిజన్ పార్కులను ఏర్పాటు చేశామని… దీనివల్ల మంచి గాలి, వాతావరణం లభించడంతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు ఎంతో వాయుకాలుష్యం నుంచి ఎంతో ఉపశమనం కలుగుతుందని మంత్రి అన్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ హరీష్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు ఎంతగానో కృషి చేశారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. అనంతరం జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ అటవీ భూములకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అక్రమణకు గురికాకుండా అటవీ శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ భూములను కాపాడటంతో పాటు గత కొద్ది సంవత్సరాలుగా ఈ భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన వారందరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంతో పాటు అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని శరత్చంద్రారెడ్డి తెలిపారు.
జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనానికి అడవులను సంరక్షించుకోవాలని, అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 33 శాతం అటవీ ప్రాంతం ఉందని… ఈ మధ్య కాలంలో అటవీ ప్రాంతం పెరిగిందని అన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా హైదరాబాద్ నగర ప్రాంతవాసులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఆక్సిజన్ పార్కులను జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఏర్పాటు చేశామని మరికొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అటవీ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని దీనివల్ల మున్ముందు తరాలకు మంచి భవిష్యత్తును అందించి కాలుష్యం లేకుండా ఉండేలా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో పనులు జరుగుతున్నాయని అన్నారు. అలాగే అటవీ శాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా జిల్లా రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు పరస్పరం సహకారం, సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హరీష్ అన్నారు. అనంతరం అటవీ సంరక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, శ్యాంసన్, అటవీ శాఖ అధికారి జిల్లాలోని ఆయా శాఖల అధికారులు, ఆర్డీవోలు, ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post