గిరి వికాసం పథకం కింద చిన్న సన్నకారు ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు బావులు – అర్హుల నుండి దరఖాస్తులు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎస్టీ జాతికి చెందిన చిన్న, సన్నకారు రైతులు ఒకరి కన్నా ఎక్కువ మంది కలసి కనీసం 5 ఎకరాల భూమిని ఒకే చోట కలిగి ఒక యూనిట్ గా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే గిరివికాసం పథకం కింద ఉచితంగా బోర్ వేసి మోటారు తో సహా అందించడం జరుగుతుందన్నారు. పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేవని, వారం పది రోజుల్లో ప్రతి అర్హులైన లబ్ది దారుల నుండి దరఖాస్తులు తీసుకోవాలని ఎంపిడిఓ లను ఆదేశించారు. గ్రామాలలో ఈ పథకం పై అవగాహన కల్పించి దరఖాస్తులు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన నిధులు ఖర్చు కాలేదని, ఆర్థిక సంవత్సరం పూర్తి కాకముందే అర్హులందరికీ లబ్ది చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో భూముల సర్వే నెంబర్ల ప్రకారం మ్యాపు లు, ధరణి పోర్టల్ లో పట్టాదారుల వివరాలు ఉంటాయని, వాటి ఆధారంగా వచ్చిన దరఖాస్తులు సరిపోల్చుకుంటామని తెలిపారు. అందువల్ల ప్రతి అర్హుల నుండి దరఖాస్తులు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ లో జిల్లాలో చేపట్టిన స్వచ్ఛ భారత్, ఓ.డి.యఫ్, ఒడిఎఫ్ ప్లస్, ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నియంత్రణపై అభిప్రాయం తెలిపే విధంగా జిల్లా నుండి అత్యధికంగా ప్రజలు తమ అభిప్రాయం తెలియజేసేవిధంగా ప్రచారం కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.