గుమ్మడం, కడుకుంట్ల గ్రామాలలో “మన ఊరు-మన బడి” కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.    తేది:01.05.2022, వనపర్తి.

వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన, మెరుగైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
ఆదివారం పెబ్బేరు మండలం గుమ్మడం, వనపర్తి మండలం కడుకుంట్ల లలో “మన ఊరు-మన బడి” కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ క్లాసులతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త తరహా బోధన చేపడుతున్నామని, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమానికి ప్రభుత్వం రూ.9,123 కోట్లు ఖర్చు చేస్తున్నదని, సర్కారు బడులు, కళాశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే వైద్యరంగం బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, పేద ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నదని ఆయన సూచించారు. గుమ్మడo గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్, బిటి రోడ్డు, గ్రామంలోని దళితులు అందరికీ డబల్ బెడ్ రూమ్ లు మంజూరు చేశామని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రజా ప్రతినిధులు, తల్లిదండ్రులు కృషి చేయాలని మంత్రి అన్నారు. సొంత స్థలాలు ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్ష రూపాయలు మంజూరు చేస్తున్నదని మంత్రి వివరించారు.
మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలలో కరంటు, నీళ్లు, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, తరగతి గదులు, ప్రహారి గోడ నిర్మాణం వంటి 12 రకాల పనులను చేర్చి, మౌళిక వసతులు కల్పించడం జరుగుతుందని మంత్రి సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ స్థాయిలో గ్రామీణ విద్యార్థులకు విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు, పోటీ ప్రపంచంలో గ్రామీణ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించి, ఉన్నత చదువులు చదివి అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. విద్య, వైద్యం కోసం ప్రజలు అదనపు ఖర్చు చేయాల్సి వస్తున్నదని, దీన్ని అధిగమించేందుకు మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. పెబ్బేరు మండలం గుమ్మడం ప్రాథమిక పాఠశాలలో రూ.28.49 లక్షలతో, వనపర్తి మండలం కడుకుంట్లలో రూ.29.70 లక్షలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంత్రి శంకు స్థాపనలు చేశారు.
జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ విడతలవారీగా, మూడు విడతల్లో జిల్లాలోని అన్ని పాఠశాలలను పునరుద్ధరిస్తామని ఆమె తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా మన ఊరు- మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ఏజెన్సీలు చొరవతో జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆమె తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆమె సూచించారు.
అనంతరం పెద్దమందడి, అడ్డాకుల మండలాల్లో మోజెర్ల, వెల్టూరు, బలీదుపల్లి, కన్మనూరు, పెద్ద మునగాల చేడ్, చిన్న మునగాల చేడ్ గ్రామాలకు 56 మంది రైతులకు వెల్టూరు గ్రామంలో మంత్రి చేతులమీదుగా స్పింక్లర్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, గుమ్మడం, కడుకుంట్ల గ్రామ సర్పంచులు, ఎంపీపీ ఆవుల శైలజ, జెడ్ పి టి సి పద్మ, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాములు, మైనారిటీ సెల్ అధ్యక్షుడు నజీర్, మార్కెట్ చైర్మన్ మంగ, రాయి శ్యామల, చెన్నయ్య, ఆంజనేయులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post