గురుకులాల్లో స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,

పత్రిక ప్రకటన

తేదీ : 03–09–2022

గురుకులాల్లో స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,
స్వచ్ఛ గురుకుల పోస్టర్ను ఆవిష్కరించిన కలెక్టర్, అధికారులు,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గురుకులాల్లో స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో స్వచ్ఛ గురుకుల పోస్టర్ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ… సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గురుకులాల్లో పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో జిల్లాలోని అన్ని ఎస్సీ గురుకుల పాఠశాలల్లో పకడ్బందీగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణను అమలు చేయాలని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన సెప్టెంబర్ 5వ తేదీన చెత్త తొలగింపు, 6న పాఠశాల భవనం, పడక గదులను శుభ్రం చేయడం, సెప్టెంబర్ 7న మూత్రశాలలు, నీటి ట్యాంకులు శుభ్రం చేయడం, పారిశుద్ధ్యం ప్రాముఖ్యతపై విద్యార్థులకు పోటీ నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. అలాగే సెప్టెంబర్ 8న పాఠశాల కిచెన్, డైనింగ్ ఏరియా పరిసరాలను పరిశుభ్రం చేయడం, సెప్టెంబర్ 9న గురుకుల పరిసరాలలో మొక్కలతో సుందరీకరించడం, సెప్టెంబర్ 10న సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సెప్టెంబర్ 11న వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ హరీశ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాలోని గురుకులాలను పూర్తి స్థాయిలో స్వచ్ఛంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్, .రజని, .సుధాకర్, .శైలజ, ఎస్సీ గురుకులాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post