పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ద్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్ లోని శ్రీరామ్ నగర్ లో 2 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే మల్టి పర్ఫస్ కమ్యూనిటీ హాల్, బస్తీ దవాఖాన భవనం నిర్మాణ పనులను మంత్రి తలసాని MLA దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ లోని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతనంగా నిర్మించే భవనం లో ఫంక్షన్ హాల్, బస్తీ దవాఖాన మాత్రమే కాకుండా, అంగన్ వాడీ కేంద్రం కూడా ఉండేలా చూడాలని, ప్లే గ్రౌండ్ ను కూడా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. గడిచిన 40, 50 సంవత్సరాల నుండి కాలనీ ప్రజలు తమ అవసరాల కోసం అభివృద్ధి పనులు చేపట్టాలని కోరితే ఎవరూ పట్టించుకోలేదన్నారు. స్థానిక కార్పొరేటర్, మేయర్ విజయలక్ష్మి, MLA దానం నాగేందర్ ల కృషితో అభివృద్ధి పనులు మంజూరైనాయని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి KCR గారి నాయకత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న దని చెప్పారు. నిరుపేదలు అధికంగా నివసించే బస్తీలలో అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి KTR గారి ప్రత్యేక శ్రద్ధతో హైదరాబాద్ నగరంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి, ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ లు వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. పెండ్లి లు ఇతర శుభ కార్యాలు జరుపుకోవడం పేదలకు పెను ఆర్థికభారం అవుతుందని, అందుకోసమే ప్రభుత్వం మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్స్ ను నిర్మించి అతి తక్కువ అద్దెకు అందిస్తున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని BS మక్తా, దీనదయాల్ నగర్, గౌరీ శంకర్ నగర్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీ తదితర ప్రాంతాల్లో మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్స్ మంజూరైనాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి నిధులు ముఖ్యం కాదని.. ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, DC రజనీకాంత్ రెడ్డి, EE విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.