గత యాసంగిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలుకు పటిష్ట చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షిస్తూ వానాకాలం పంట కోతలు మొదలైనందున రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయుటకు గురువారం నుండి జిల్లాలో 311 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగిందని అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలలో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, గన్ని బ్యాగులు, టార్పాలిన్లు, తేమను కొలిచే యంత్రాలు, ప్యాడి క్లీనర్లు అందుబాటులో ఉంచవలసినదిగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 147 రా రైస్, బాయిల్డ్ రైస్ మిల్లులకు ధాన్యం తరలించే విధంగా ట్రాన్స్ పోర్ట్ లారీలకు జియో ట్యాగింగ్ చేయాలన్నారు. రైతు వారీగా, కేంద్రం వారీగా పంట వివరాలను కేంద్రం ఇంచార్జి, వ్యవసాయ విస్తరణాధికారులకు ఇచ్చి ప్రతి మూడు రోజులకొకసారి సమీక్షిస్తుండాలని అన్నారు. ధాన్యం రవాణా కోసం ఇద్దరు కాంట్రాక్టర్ల నుండి 800 లారీలను ఏర్పాటు చేయాలని, మిల్లు వారీగా లేబర్ ను సమకూర్చాలని సూచించారు. రైతులు తమ స్వంత ట్రాక్టర్ ల ద్వారా ధాన్యం తరలించుటకు అనుమతించాలని, మిల్లు వద్ద లారీలు, ట్రాక్టర్ ల లైన్లు విడివిడిగా ఉండేలా చూడాలని అన్నారు. మిల్లులకు ధాన్యం తరలిన వెంటనే దించుకునేలా చూడాలని ఇందుకోసం మిల్లు వారీగా అధికారులను నియమించాలని సూచించారు. ప్రతి మండలానికి ఏం.పి .డి.ఓ.లు, మండల వ్యవసాయాధికారులతో పర్యవేక్షిస్తూ ప్రత్యేక అధికారులను నియమించాలని, తహసీల్ధార్లు కూడా భాద్యత వహించాలని సూచించారు. వి.ఆర్.ఓ. లు కొనుగోలు కేంద్రాలలో టోకెన్ ప్రకారం ధాన్యం సేకరించి చేసి మిల్లులకు తరలించాలని అన్నారు. ఇతర ప్రాంతాల నుండి ధాన్యం రాకుండా కట్టడి చేయాలని అదనపు ఎస్పీ కృష్ణ మూర్తికి సూచించారు. ధాన్యం నిలువకు సరిపడా గోదాములు లేనందున ఖాళీ ప్రదేశాలలో సరైన రక్షణతో ధాన్యం నిలువ చేసి టార్పాలిన్ లు కప్పాలన్నారు. కేంద్రాలకు 45 రోజుల పాటు ధాన్యం వచ్చే అవకాశమున్నందున ఎలాంటి డీవియేషన్ లకు ఆస్కారం లేకుండా అందరు అధికారులు సమిష్టిగా బాధ్యతో పనిచేయాలని ఆదేశించారు. ఏ గ్రేడ్ రకం 1960, సాధారణ రకం 1940 మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నందున రైతులు దళారీలను ఆశ్రయించి పొసపోవద్దని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎఫ్.సి.ఐ ధాన్యాన్ని కొనక పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి , సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రైతులు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా ,24 గంటల కరెంటు ఇవ్వడం, మిషన్ కాకతీయ, హల్దీ, కాళేశ్వరం ద్వారా చెరువులు నింపి సాగునీరందించడం జరిగిందన్నారు. తద్వారా పంట సాగు ఘననీయంగా పెరిగిందని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకు కొనుగోలు చేయుటకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకు వచ్చే ముందు ధాన్యాన్ని తాళ్లు లేకుండా, 17 శాతం తేమ శాతం మించకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులందరూ ధాన్యాన్ని ఒకేసారి తీసుకురాకుండా విడతలవారీగా తీసుకురావాలని ఆమె సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, అడిషనల్ ఎస్పీ కృష్ణ మూర్తి, డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.ఎస్.ఓ. శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్ నాయక్, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్, మార్కెటింగ్ శాఖా సహాయ సంచాలకులు రియాజ్, డి.సి.ఓ. కరుణ, లీగల్ మెట్రాలజీ తదితరులు పాల్గొన్నారు.
గురువారం నుండి జిల్లాలో 311ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు -జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్
