గోపాల్ పేట, చెన్నారం పరిధిలోని ఐ.కె.పి, పి.ఎ.సి.ఎస్. కేంద్రాలను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్

పత్రికా ప్రకటన.    తేది:9.12.2021, వనపర్తి.

ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నదని, ఐ.కె.పి, పి.ఎ.సి.ఎస్. కేంద్రాల ద్వారా లబ్ధి పొందేలా వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆదేశించారు.
గురువారం గోపాల్ పేట, చెన్నారం పరిధిలోని వరి కొనుగోలు కేంద్రాలను, గోపాల్ పేట పి.ఎ.సి.ఎస్. కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరి ప్రధాన పంటగా జిల్లాలో సాగు చేస్తున్నారని, అత్యధికంగా వరి పండిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేంద్రం (FCI) వరి ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిందని, ప్రత్యామ్నాయ పంటలపై రైతుల దృష్టి సారించాలని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 230 ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు వరి ధాన్యం తేమ ఉండేలా చూడాలని, తాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. కొంతమేర కూలీల కొరత ఉన్నదని, రైతులు ఒకరికి ఒకరు సమన్వయంతో ధాన్యం నింపాలని, రవాణాలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన వివరించారు. ధాన్యం సేకరణలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు.
గోపాల్ పేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని (PACS) ఆయన పరిశీలించారు. రైతులకు అందవలసిన అన్ని అవకాశాలను సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్నదని, రైతులు దళారులు, ప్రైవేటు వ్యక్తుల దగ్గర రుణ సదుపాయం పొంది నష్టపోకూడదని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను సద్వినియోగం చేసుకొని, రైతు సంఘాల ద్వారా వారికి కావలసిన సదుపాయాలను సమకూర్చుకోవాలని ఆయన తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పరికరాలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించుటకు రైతు వేదికలను ఏర్పాటు చేసినట్లు, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంట డి ఆర్ డి ఓ, ఐకెపి సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post