గ్యాస్ సిలిండర్ పై నిర్ణీత రేటు కన్నా అదనంగా డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ వీరారెడ్డి హెచ్చరించారు.
గ్యాస్ సిలిండర్ పై వినియోగదారుల నుండి అదనంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జిల్లాలోని ఎల్పీజీ డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్యాస్ సిలిండర్ పై 20 నుండి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
గ్యాస్ సిలిండర్ నిర్ణీత ధర కన్నా అదనంగా డబ్బులు వసూలు చేయరాదని ఆయన స్పష్టం చేశారు.
ఎవరైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే , సంబంధిత ఏజెన్సీ పై ఈ.సి. యాక్ట్ 1955 ప్రకారం డీలర్ షిప్ రద్దు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
జిల్లాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో ఇన్ఛార్జి జిల్లా పౌరసరఫరాల అధికారి రాధికా రమణి, ఉప తహశిల్దార్, జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీ డీలర్ లు, తదితరులు పాల్గొన్నారు.