గ్రంథాలయాల పటిష్టతకు చర్యలు – గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్

గ్రంథాలయాల పటిష్టతకు చర్యలు – గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్

మెదక్ పట్టణంలో రెండున్నర కోట్ల వ్యయంతో అన్న హంగులతో నూతన జిల్లా గ్రంధాలయ భవనాన్ని నిర్మించనున్నామని జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షలు చంద్ర గౌడ్ తెలిపారు. గ్రంథాలయాల మీద మక్కువతో రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు హరీష్ రావు, స్థానిక శాసనసభ్యులు పద్మాదేవేందర్ రెడ్డి కృషివల్ల మెదక్ పట్టణంలోని కోర్టు ప్రక్కన 38 గుంటల ప్రభుత్వ స్థలం కేటాయించారని, భవన నిర్మాణానికి నిధులు సమీకరిస్తున్నామని అన్నారు.
శుక్రవారం జిల్లా గ్రంధాలయంలో జరిగిన సంస్థ సర్వ సభ్య సమావేశంలో మాట్లాడుతూ మన రాష్ట్రంలో సిద్ధిపేట, సిరిసిల్లలో ఉన్న గ్రంధాలయ భవనాలకు దీటుగా సుమారు ఒక ఎకరా స్థలంలో అన్ని హంగులతో సర్వాంగసుందరంగా భవన నిర్మాణం గావించనున్నామని అన్నారు. అందులో భాగంగా 2022-23 బడ్జెట్ లో భవన నిర్మాణానికి 50 లక్షలు ప్రతిపాదించామని అన్నారు. ఇట్టి గ్రంథాలయాన్ని పూర్తి డిజిటలైజ్ చేస్తామని యువత కు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రస్తుతమున్న గ్రంధాలయ భవనాన్ని పట్టణంలో యదావిధిగా కొనసాగిస్తామని అన్నారు. నరసాపూర్ పట్టణంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న భవనం తుది దశలో ఉన్నదని, రేగోడ్ లో 25 లక్షల వ్యయంతో గ్రంధాలయ భవన నిర్మాణానికి కలకత్తా లోని రాజారామ్ మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ కు ప్రతిపాదనలు పంపామని అన్నారు. డిపార్ట్మెంట్ అఫ్ పబ్లిక్ లైబ్రరీ నుండి పోటీ పరీక్షలు, సైన్స్ ఫిక్షన్, మహిళలు, పిల్లల సాహిత్యం తదితర అంశాలకు సంబంధించి 585 పుస్తకాలు అందాయని, వాటిని జిల్లాలోని 15 శాఖా గ్రంథాలయాలకు, రెండు గ్రామీణ గ్రంథాలయాలకు పంపిణి చేయనున్నామని అన్నారు. పుస్తక పఠన ప్రియులకు గ్రంథాలయాలలో మంచి సాహిత్యం గల పుస్తకాలతో పాటు విద్యార్థులు పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో గ్రంథాలయాల పటిష్టతకు, అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని దాతల సహాకారంతో గ్రంథాలయాలను డిజిటలైజేషన్ చేయనున్నామని అన్నారు. తమ గ్రామాలలో గ్రంధాలయాలు నెలకొల్పుటకు ఆసక్తి గల గ్రామ పంచాయతీలు ముందుకు వచ్చి భవనం సమకూరిస్తే దాతల సహాకారంతో కంప్యూటర్లు సమకూర్చి డిజిటల్ మెటీరియల్ తో నేటి సమాజానికనుగుణంగా అవసరమైన వ్యవసాయ, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు, మాగజైన్లను అందిస్తామని చంద్ర గౌడ్ తెలిపారు.
జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామా పంచాయితీల ద్వారా 4 కోట్ల 34 లక్షల పన్నులు వసూలు చేయాలని లక్ష్యంకాగా అందులో 8 శాతం సెస్ రూపంలో అనగా సుమారు 57 లక్షల ఆదాయం గ్రంథాలయాలకు వస్తుందని అన్నారు. ఈ నిధులు గ్రంథాలయాల పటిష్టతకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
ఈ సందర్భంగా 2022-23 సంవత్సరానికి భవన నిర్మాణాలకు, మరమ్మతులకు, పుస్తకాలు,మ్యాగజైన్లు , ఫర్నీచర్, కంప్యూటర్లు తదితర కొనుగోలు చేయుటకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలకై కోటి 58 లక్షల బడ్జెట్ కై పౌర గ్రంధాలయ శాఖా సంచాలకులు ప్రతిపాదనలు పంపుటకు సమావేశం తీర్మానించింది. అదేవిధంగా ప్రస్తుత గ్రంధాలయ భవనం లో నిర్మిస్తున్న అదనపు గదులను, శౌచాలయం పూర్తి గావించుటకు, బోర్ వేయుటకు 16 లక్షల అంచానా ఖర్చుకు సమావేశం తీర్మానించింది.
ఈ సమావేశంలో వయోజన విద్య ఉప సంచాలకులు రామేశ్వర్, డిపిఆర్ ఓ శాంతి కుమార్, సభ్యులు సిద్దిరాములు, అనూష, విజయలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post