గ్రామాలలో వందశాతం వ్యాక్సిన్ అందించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

వ్యాక్సినేషన్ వందశాతం జరిగేలా ఇంటింటి సర్వే చేసి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం రోజున ఇచ్చోడ, సిరికొండ గ్రామాలలో పర్యటించి వ్యాక్సినేషన్ పంపిణి, ఇంటింటి అవగాహన, సర్వే, బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు వంటి అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పంచాయితీ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఇచ్చోడ, సిరికొండ మండల కేంద్రాలలోని పలు వార్డులలో తిరిగి వ్యాక్సినేషన్ పై ప్రజలకు కల్పిస్తున్న అవగహన, సర్వే వంటి అంశాలపై పరిశీలించారు. ఆయా వార్డుల లోని ప్రజలతో నేరుగా మాట్లాడుతూ, వ్యాక్సిన్ తీసుకోవడం వలన కలిగే లాభాలపై ఆయన తెలియజేశారు. అదేవిధంగా వైద్య సిబ్బంది, పంచాయితీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామంలోని 18 ఏళ్ళు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందే విధంగా అవగాహన కల్పించి వ్యాక్సిన్ అందించాలని అన్నారు. మొదటి డోస్ తీసుకున్న వారు రెండవ డోస్ ను కూడా తీసుకునే విధంగా ప్రజలకు తెలియజేయాలని అన్నారు. అనంతరం సిరికొండ మండలం రిమ్మ గ్రామంలో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనం స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రకృతి వనం ఏర్పాటుకు సంబంధించి నిబంధనలను పాటించాలని మండల అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో ఆయా మండలాల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post